ఘనంగా యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Published: Thursday April 14, 2022
బోనకల్, ఏప్రిల్ 13 ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని బోనకల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు వెంటనే షెడ్యూల్ ప్రకటించి ఈ వేసవి సెలవుల్లోనే నిర్వహించాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా కోశాధికారి వల్లంకొండ. రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఆవరణలో టీఎస్ యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంఘ పతాకాన్ని ఆవిష్కరించి ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వకపోవడం వలన వేలాదిమంది ఉపాధ్యాయులు ఒకే కెడర్ లో పనిచేస్తూ నిరాశగా ఉన్నారని, నిస్పృహలతో ఉద్యోగ విరమణ చేస్తున్నారన్నారు. కావున, ప్రభుత్వం వెంటనే పదోన్నతులు చేపట్టాలన్నారు. ఏడు వేల కోట్ల రూపాయలతో మన ఊరు - మన బడి కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన అన్నారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చిత్త శుద్దితో అమలు చేయాలని,కేవలం పాఠశాలల మౌలిక వసతుల కల్పనే గాకుండా ప్రతి పాఠశాలలో తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని, కేవలం బడులకి రంగులు వేసినంత మాత్రాన సరిపోదని ఆయన అన్నారు. టీఎస్ యుటిఎఫ్ నికరంగా ఉపాధ్యాయుల పక్షాన పోరాడే సంఘమని, రానున్న రోజుల్లో ఉపాధ్యాయుల సమస్యల సాధన కోసం సంఘాలన్నీ ఐక్య పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఖాళీలన్నింటిని భర్తీ చేయాలని, జూన్ లో పాఠశాలలు ప్రారంభం నాటికీ నియామకాలు సాధ్యం కాకపోతే ఆ స్థానంలో విద్యా వాలంటీర్లను నియమించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్సులు బి.ప్రీతమ్, గుగులోత్ రామకృష్ణ,మండల నాయకులు కె.రమేష్, పి.గోపాలరావు, ఏ. అనిల్ కుమార్, పి.నరసింహారావు, పుల్లారావు, సీనియర్ నాయకులు, బీసీ వెల్ఫేర్ రాష్ట్ర అధ్యక్షులు లెవిన్ పిల్లలమర్రి.అప్పారావు, సదా.బాబు, అరుణకుమారి, లక్ష్మీ, మంజూష, అనిత, పద్మావతి, నారాయణ, శ్రీనివాస్, లవకుశ, కేజీబీవీ, గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.