అయ్యప్పస్వామిసాయిబాబాదేవాలయంపరిధిలోజనావాసాల మధ్య పెరిగిన చెట్లు మురికగుంటలో

Published: Wednesday November 09, 2022
మధిర నవంబర్ 8 (ప్రజా పాలన ప్రతినిధి)
మధిర మున్సిపాలిటీ పరిధిలోని సాయిబాబా గుడి లడక్ బజార్ అయ్యప్ప నగర్ రోడ్లు చినుకు పడితే చిత్తడిగా మారి మాగాణి పొలాలను తలపిస్తున్నాయి. అంతేకాకుండా జనావాసాల మధ్య ఉన్న కాళీ స్థలాల్లో మురికి కుంట కంప చెట్లు పెరిగి అడవిని తలపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో గత పది సంవత్సరాలుగా కొంతమంది మున్సిపాలిటీ అనుమతులు తీసుకొని ఇండ్లు నిర్మించుకొని నివసిస్తున్నారు. అయితే ఈ ఇండ్ల ముందు ఉన్న రోడ్లకు కనీసం మట్టి కూడా మున్సిపాలిటీ అధికారులు తోలించకపోవడంతో ఎక్కడికక్కడ గుంతలు పడి కనీసం నడవలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇక వర్షం పడితే ఈ రోడ్లు మొత్తం బురద మయంగా మారి మాగాణి భూములను తలపిస్తున్నాయి. వేలాది రూపాయలు మున్సిపాలిటీకి అనుమతుల కోసం చెల్లించి అనుమతులు తీసుకొని ఇండ్లు నిర్మించుకుంటే ఆ ఇళ్ల ముందు రోడ్లకు కనీసం మట్టిని కూడా తోలకొండ ఉండడం శోచనీయమని ఆ ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆ ప్రాంతంలోని ఖాళీ ప్లాట్లలో పిచ్చి చెట్లు పెరిగిపోయి విష పురుగులు సంచరిస్తున్నాయి. గతంలో కాళీ ప్లాట్ లలో చెట్లు పెరిగిన సంబంధించిన స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేసి మున్సిపాలిటీ స్థలాలు అనే బోర్డులు పెట్టి శుభ్రం చేయించిన మున్సిపాలిటీ  అధికారులు ఈ ఏరియాలోని ఖాళీ ప్లాట్లలో పెరిగిన పిచ్చి చెట్లను గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో ప్లాట్ల యజమానులు కూడా శుభ్రం చేయించేందుకు ముందుకు రాలేదు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి ఖాళీ స్థలాల్లో పెరిగిన చెట్లను తొలగించుకునే విధంగా సంబంధిత స్థల యజమానులకు  నోటీసులు జారీ చేయడంతో పాటు రోడ్లకు మరమ్మత్తులు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.