రాళ్లచిట్టంపల్లిలో బస్సు షెల్టర్ నిర్మాణం

Published: Wednesday January 04, 2023
* 1.8 లక్షల ఎన్ఆర్ఈజిఎస్ నిధులు
* సర్పంచ్ ముఫ్లయాస్మిన్ గౌస్
వికారాబాద్ బ్యూరో 3 జనవరి ప్రజా పాలన : రాకపోకలు కొనసాగించే ప్రయాణికుల సౌకర్యార్థం బస్సు షెల్టర్ నిర్మాణం పనులు కొనసాగిస్తున్నామని రాళ్లచిట్టంపల్లి గ్రామ సర్పంచ్ మఫ్లయాస్మిన్ గౌస్ అన్నారు. మంగళవారం వికారాబాద్ మండల పరిధిలోని రాళ్లచిట్టంపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ మఫ్లయాస్మిన్ గౌస్ పంచాయతీ కార్యదర్శి సాయి ప్రతిభ క్షేత్ర పాలకురాలు నస్రీన్ అబ్దుల్ రజాక్ ఎంవిఎఫ్ కోఆర్డినేటర్ తలారి లక్ష్మి శ్రీనివాస్ గ్రామ టిఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సిరిపురం అమీరుద్దీన్ లతో కలిసి బస్సు షెల్టర్ నిర్మాణం, హరితహారం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ముఫ్లయాస్మిన్ గౌస్ మాట్లాడుతూ 1.8 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో బస్సు షెల్టర్ నిర్మాణం పనులను చేపడుతున్నామని తెలిపారు. బస్సు షెల్టర్ పొడవు 21 ఫీట్లు వెడల్పు 14 ఫీట్లతో రేకుల షెడ్ తో నిర్మించనున్నామని స్పష్టం చేశారు. రాబోవు హరితహారానికి నర్సరీలో జామ, నిమ్మ, దానిమ్మ, కరివేపాకు, కానుగ, బాదాం, గంగరావి, పచ్చ గన్నేరు మొక్కలను పెంచుతున్నామన్నారు. నిమ్మ, జామ, దానిమ్మ, కరివేపాకు మొక్కలను 5 వేల రూపాయలకు, బాదం కానుగ విత్తనాలను రెండు వేల రూపాయలకు ఖరీదు చేశామని వివరించారు. మొక్కలు ఎండిపోయిన బ్యాగులలో మళ్ళీ పెడుతున్నామని స్పష్టం చేశారు. కంపోస్ట్ షెడ్డులో కంపోస్ట్ ఎరువును తయారుచేసి జిపి కి సంబంధించిన మొక్కలకు వాడుతున్నామని వెల్లడించారు. వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మీతో నేను కార్యక్రమంలో భాగంగా రాళ్లచిట్టంపల్లికి వచ్చి నప్పుడు విద్యుత్ సమస్యల గురించి ఫిర్యాదు చేశామని చెప్పారు. ఫిర్యాదు చేసిన సమస్యలు పాత స్తంభాలను తొలగించి కొత్త వాటిని ఏర్పాటు చేయడం కొత్త కాలనీకి లైన్ వేయించడం పొలాల కొరకు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరారు అని తెలిపారు. అయినా ఇప్పటివరకు విద్యుత్ సమస్యలు పరిష్కారాం కాకపోవడం ఆందోళన కలిగిస్తున్నదని విచారం వ్యక్తం చేశారు. గ్రామంలో 278 ఇండ్లు ఉండగా ఇప్పటివరకు పన్నులు 50% వసూలు చేశామని స్పష్టం చేశారు. 2023 మార్చి 31 వరకు 100% పన్నులు వసూలు చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.