దేశానికి ఉత్తమమైన పౌరులను అందించేది ఉపాధ్యాయులే ** జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

Published: Tuesday September 06, 2022
ఆసిఫాబాద్ జిల్లా సెప్టెంబర్ 05 (ప్రజాపాలన, ప్రతినిధి) : దేశ ఆర్థిక అభివృద్ధి, సంక్షేమం యువత చేతులలోనే ఉందని, బాల్యం నుంచి పిల్లలకు మంచి  నడవడిక, సత్ప్రవర్తన, క్రమశిక్షణ, అందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సోమవారం సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పాయి, జిల్లా పరిషత్ చైర్మన్ కోవా లక్ష్మి తో కలిసి, సర్వేపల్లి రాధాకృష్ణ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తి నుండి రాష్ట్రపతి వరకు దేశానికి ఎన్నో సేవలు అందించాలని, ఆయన జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాధాకృష్ణన్ స్ఫూర్తితో ఉపాధ్యాయులు విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి అందించాలని, విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించడానికి ఉపాధ్యాయులే తొలిమెట్టు అని, ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైనదని, భావి తరాలను సన్మార్గంలో నడిపించాలని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రదర్శనలు అందరినీ అలరించాయి.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి ఉదయ్ బాబు,ఉపాధ్యాయులు, అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు.