బహిరంగ మలమూత్ర రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి

Published: Wednesday January 25, 2023
* వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 24 జనవరి ప్రజా పాలన : ప్రతి గ్రామాన్ని బహిరంగ మలమూత్ర విసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం మరపల్లి మండల పరిధిలోని బూచన్ పల్లి, కొత్లాపూర్, పట్లూరు గ్రామాల అనుబంధ గ్రామాలు జాజిగుబ్బర్ తండా, అల్లాపూర్, పట్లూరు తండాలో మీతో నేను కార్యక్రమంలో భాగంగా భూచన్ పల్లి సర్పంచ్ జయ దయాకర్ ముదిరాజ్ కొత్లాపూర్ సర్పంచ్ నల్లోల్ల ప్రభాకర్ పట్లూర్ సర్పంచ్ దేవరదేశి ఇందిర అశోక్ అధ్యక్షతన మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నాదిరీగ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 7 నుండి 11 గంటల వరకు వీధి వీధి తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాజిగుబ్బర్ తండాలో పంట పొలాలలో అవసరమైన చోట నూతన స్తంభాలు ఏర్పాటు చేసి, వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయాలన్నారు. అల్లాపూర్ గ్రామానికి నూతనంగా ఒక ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయాలని  విద్యుత్ అధికారులకు సూచించారు. అల్లాపూర్ గ్రామంలో మిషన్ భగీరథ పైపుల లీకేజిలను సరి చేసి గ్రామానికి సరిపడా నీటిని అందించాలని అధికారులను ఆదేశించారు. జాజిగుబ్బర్ తండా, అల్లాపూర్, పట్లూర్ తండాలలో వృద్ధాప్య, వికలాంగుల పెన్షన్లు, రేషన్ బియ్యం  ఎక్కడికక్కడ అదే గ్రామంలో ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
అల్లాపూర్, జాజిగుబ్బర్ తండా మరియు పట్లూరు తండాల్లో మురుగు కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు.
ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకొని, వాటిని వాడుకలో ఉంచుకోవాలన్నారు. పాడు బడ్డ ఇళ్ళు, పిచ్చిమొక్కలు తీసేసి, ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేయాలన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.
అనంతరం బూచన్ పల్లి గ్రామానికి చెందిన ముగ్గురికి కొత్లాపూర్ గ్రామానికి చెందిన ఒకరికి మంజూరైన ఒక లక్ష 76 వేల రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. పట్లూరు తండా రాంపూర్ అల్లాపూర్ ఈ గ్రామాలను కలిపి ఒక గ్రామ పంచాయతీ గా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. పట్లూరు తండా వాసులు పట్లూరు గ్రామానికి అనుబంధంగా కొనసాగుతామని సభాముఖంగా చెప్పారు. అందుకు స్పందించిన ఎమ్మెల్యే జిపిగా ఏర్పాటు కావాలంటే కనీసం 500 జనాభా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పబ్బె మధుకర్, ఎంపిటిసిల ఫోరం అధ్యక్షుడు మల్లేశం మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నాయబ్ గౌడ్ ఎంఆర్ఓ శ్రీధర్ ఇంచార్జ్ ఎంపిడిఓ మహేష్ ఏఓ వసంత ఆర్ డబ్ల్యూఎస్ సాయినాథ్ పిఆర్ఏఈ శ్రవణ్ కుమార్ ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.