కాజేసిన నిధులను వెంటనే జిపిలో జమ చేయాలి

Published: Saturday December 31, 2022
రాష్ట్ర సర్పంచుల ఐక్యవేదిక అధ్యక్షులు సర్పంచ్ కొనింటి సురేష్

వికారాబాద్ బ్యూరో 30 డిసెంబర్ ప్రజా పాలన : కాజేసిన నిధులను వెంటనే

గ్రామపంచాయతీ నిధులలో జమచేయాలని రాష్ట్ర సర్పంచుల ఐక్యవేదిక అధ్యక్షులు, సర్పంచ్ కొనింటి సురేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఒక ప్రకటనలో మాట్లాడుతూ సర్పంచులు, ఉపసర్పంచుల డిజిటల్ కీ ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వం సర్పంచుల ఖాతాల్లో నిధులను ఎలా తీసుకుంటుందని ప్రశ్నించారు. గ్రామపంచాయతీ ఆధీనంలో ఉండాల్సిన డిజిటల్ కీ, రికార్డులు ఎంపిడీఓల ఆధీనంలో ఉండటం ఏంటని, వాటిని వెంటనే గ్రామపంచాయతీలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. కేంద్ర నిధులతో పాటు ఎస్ఎఫ్సీ నిధులను కూడా ఊడ్చేసి సర్పంచులకు తెలియకుండా నిధులను ప్రభుత్వం వాడుకోవడం ఏంటని ఆయన ధ్వజమెత్తారు. గ్రామాల్లో పల్లెప్రకృతి వనాలు, పారిశుద్ధ్య పనులు, కరెంట్ బిల్లులు వంటి అనేక అభివృద్ధి పనులకోసం 20 లక్షల రూపాయలు అప్పు చేశామన్నారు. ఇప్పుడు ఆ బిల్లులు చెల్లించకపోగా, వచ్చిన నిధులను దారి మళ్లించడం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దారి మళ్లించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గ్రామపంచాయతీల ఖాతాల్లో జమ చేసి అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని కోరారు. లేనిపక్షంలో సర్పంచుల సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టి ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని హెచ్చరించారు.