పట్టణ ప్రగతిని నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు.

Published: Wednesday June 30, 2021

ఆధునిక మున్సిపాలిటీగా తీర్చిదిద్దడం కోసం అందరూ కృషి చేయాలి.
సుస్థిరమైన అభివృద్ధి కోసం మౌలిక వసతుల కల్పనపై శ్రద్ధ చూపాలి.
జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి.

మంచిర్యాల జిల్లా ప్రతినిధి, జూన్ 6, ప్రజాపాలన : పట్టణ ప్రగతిలో చేపట్టే కార్యక్రమాల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ భారతీ హోళికేరి హెచ్చరిం చారు. జిల్లా కేంద్రంలోని పటేల్ గార్డెన్ లో మూడవ విడత పట్టణ ప్రగతిపై ప్రజాప్రతినిధులకు, అధికారులకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ పురాణం సతీష్, శాసనస భ్యులు నడిపల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠీ, ప్రతిభా సింగ్ లతో కలిసి అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణానికి పల్లెలకు చాలా వ్యత్యాసం ఉందని, 46 శాతం మంది ప్రజలు మున్సిపాలిటీలలో నివసిస్తున్నరని అన్నారు. ప్రతి మున్సిపాలిటీని అధునాతనంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నా కలెక్టర్ ఇందుకోసం ప్రజా ప్రతినిధులు, మున్సిపాలిటీ సిబ్బంది, అధికారులు కృషి చేయాలని కోరారు. గ్రీన్ ట్రీ కోసం కేటాయించిన నిధులను వేరే పనులకు మళ్ళించడానికి వీల్లేదని అన్నారు. మున్సిపాలిటీలలో స్థిరమైన అభివృద్ధి తీసుకురావాలని, భావితరాలు బాగు పడేలా అలోచనలు చేసి మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. పల్లెలు ప్రగతి బాటలో నడుస్తున్నాయన్న కలెక్టర్ పట్టణ ప్రగతి పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో పనిచేసే వారిని ప్రోత్సహించాలని, పనిచేయని వారిపై జిల్లా అదనపు కలెక్టర్ చర్యలు తీసుకుంటారని పేర్కొన్న జిల్లాకలెక్టర్ వారిపై జాలి చూపితే అదనపు కలెక్టర్ పై సైతం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
ఆబాది భూముల్లో అనుమతులు ఇవ్వాలి: ఎమ్మెల్సీ
మున్సిపాలిటీ చట్టాలు కఠినంగా ఉన్నాయని మానవతాదృక్పదంతో వ్యవహారించి ఆబాది భూముల్లో ఇండ్లు నిర్మించుకున్న పేదలకు నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్సీ పురాణం సతీష్ అధికారులను కోరారు. పేదలకు మంచి జరగడం కోసం ప్రజల తరఫున అధికారులకు అండగా ఉంటామని అన్నారు. త్వరలోనే ప్రతి శాసన సభ్యుడికి రూ 5/- కోట్ల నిధులు రానున్నాయని మున్సిపాలిటీలలో మౌలిక వసతులు కల్పనకు కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. మంచిర్యాల శాసన సభ్యులు నడిపల్లి దివాకర్ రావు మాట్లాడుతూ మహిళా కౌన్సిలర్లు చైతన్యవంతులు కావాలని సూచించారు. ఇందుకోసం సమస్యలపై అవగాహన పెంచుకోవాలని కోరారు. ఎన్నికల సమయంలో గెలుపు కోసం కౌన్సిలర్లు తమ భర్తల పై, అన్నదమ్ముల పై ఆధారపడ్డప్పటికి ఒంటరిగా ప్రజల మద్యలో తిరిగి స్వయంగా సమస్యలను పరిష్కరిస్తూ మహిళా నాయకురాళ్ళుగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఏడు మున్సిపాలిటీ లకు  సంబంధించిన చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.