అమీర్ పేట్ డివిజన్ లో పలు కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి తలసాని

Published: Monday October 04, 2021
బాపునగర్ లో మెగా హెల్త్ క్యాంప్
అమీర్ పేట్ జోన్ (ప్రజాపాలన ప్రతినిధి) : బాపునగర్ బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ మరియు ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో బాపునగర్ బస్తీ లోని మెగా హెల్త్ క్యాంప్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కరోనా వలన ప్రజలలో ఆరోగ్యం పై శ్రద్ద పెరిగిందన్నారు, ఇలాంటి మెగా హెల్త్ క్యాంపుల వల్ల అధిక ప్రయోజనం పేదప్రజలకు దక్కుతుందని, ఈ సందర్భంగా మెగా హెల్త్ క్యాంపు నిర్వాహకులు ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ సిబ్బందిని అభినందించారు. ఈ క్యాంపు లో కార్డియాలజీ, న్యూరాలజీ, ఈ ఎన్ టి వంటి వివిధ విభాగాలకు సంబంధించి పరీక్షలు నిర్వహించగా, బాపునగర్ బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిసింగ్ జాదవ్ ఆధ్వర్యంలో బస్తీ వాసులు పెద్ద ఎత్తున ఈ మెగా క్యాంపు లో పాల్గొన్నారు.
బతుకమ్మ చీరల పంపిణీ
స్థానిక వివేకానంద కమ్యూనిటీ హాల్ లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మంత్రి తలసాని పేద మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్ర పండుగగా అభివర్ణించారు, నాటి కాలంలో బతుకమ్మ పండుగ వస్తుందంటే రెండు నెలల ముందు నుండే సందడి కనిపించేదని నేడు అది కరువైందన్నారు, నేటి తరానికి మన పండుగల విశిష్టతను తెలియ జేసే బాధ్యత తల్లిదండ్రులదేనని అన్నారు, బతుకమ్మ పండుగ మన ఆడపడుచులకు అత్యంత ఇష్టమైన పండుగ అని, అందుకే మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు ఆడపడుచులకు విశిష్టమైన బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రభుత్వమే చీరల పంపిణీకి శ్రీకారం చుట్టిందన్నారు. జి హెచ్ ఎం సి ఆధ్వర్యంలో ఈ చీరలను పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీర్ పేట్ కార్పొరేటర్ కేతినేని సరళ, మాజీ కార్పొరేటర్ శేషు కుమారి, అమీర్ పేట్ డివిజన్ తెరాస అధ్యక్షుడు హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి సంతోష్  కుమార్, జిహెచ్ఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.