రాష్ట్ర బడ్జెట్ కొన్ని ప్రాంతాలకే పరిమితం

Published: Tuesday February 07, 2023
జిల్లా టీ-జేఏసీ చైర్మన్ ముకుంద నాగేశ్వర్
వికారాబాద్ బ్యూరో 06 ఫిబ్రవరి ప్రజాపాలన : తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ 2023-24 కేటాయింపులు ఘనంగా కనిపిస్తున్నా ఖర్చు మాత్రం కొన్ని ప్రాంతాలకే పరిమితంగా పూర్తిస్థాయిలో చేయక పోవడం బాధాకరమని  జిల్లా టీ-జేఏసీ చైర్మన్ ముకుంద నాగేశ్వర్ విమర్శించారు. సోమవారం ప్రజాపాలన బ్యూరో రిపోర్టర్ తో మాట్లాడుతూ ఎనిమిదిన్నర ఏళ్లలో బడ్జెట్ కేటాయింపులు, ఖర్చు ఎక్కువగా ఉత్తర తెలంగాణలో చేస్తూ దక్షిణ తెలంగాణకు మొండి చెయ్యి చూపినా స్పందించని, సోయి లేని ప్రజాప్రతినిధులుండడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 60 శాతం పూర్తి చేశామని చెప్తున్నారు. కానీ పూర్వ రంగారెడ్డి జిల్లాలో సుమారు 3.2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టు పనులను ఇప్పటికీ ప్రారంభించలేదని ఘాటుగా స్పందించారు. పరిగిలో గత ఎన్నికల హామీలు అయిన పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటును విస్మరించడం, అదేవిధంగా వెనుకబడిన వికారాబాద్ జిల్లాలో జేఎన్టీయూ పరిధిలో నూతన ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటును విస్మరించారన్నారు. తెలంగాణ ఫార్మసీ యూనివర్సిటీ ఏర్పాటుకు కేటాయింపులు జరపకపోవడం అదేవిధంగా నూతన ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాలలతో పాటు నూతన ప్రభుత్వ ఫార్మసీ కళాశాలల ఏర్పాటును విస్మరించడం బాధాకరమన్నారు. వికారాబాద్ జిల్లాలో బిసి, గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు లేవని స్పష్టం చేశారు. ప్రజలకు ఇప్పటి వరకు ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా ఇవ్వని వికారాబాద్ జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి కనీసం 10,000 ఇళ్ల జాగాలు ఉన్న వాళ్ళకి మూడు లక్షల రూపాయలు ఇచ్చే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని హితవు పలికారు. అనంతగిరి ఆయుష్, అనంతగిరి పర్యాటక అభివృద్ధికి నిధులు కేటాయించలేదన్నారు. తాండూరులో కందిబోర్డు, స్టోన్ క్రషింగ్ పరిశ్రమ ఏర్పాటుకు నిధులు  మంజూరు చేయాలని ఆలోచన రాకపోవడం దురృష్టకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ నిధులనైనా దక్షిణ తెలంగాణలో గత ఎనిమిదిన్నరేళ్లుగా వివక్షతో పెండింగ్లో ఉంచిన అన్ని పనులను పూర్తి చేయడానికి చర్యలు చేపట్టి ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలను కూడా గుర్తిస్తే మంచిది లేనిపక్షంలో బిఆర్ఎస్ పేరుతో దేశం అంతా తిరుగుతున్న మీ పార్టీ ప్రజాగ్రహానికి గురై తెలంగాణలో ఉత్తర తెలంగాణకే పరిమితం అవడం ఖాయమని హెచ్చరించారు.