ప్రణాళికా బద్దంగా చదివితే విజయం తథ్యం

Published: Saturday May 21, 2022
వికారాబాద్ బ్యూరో 20 మే ప్రజాపాలన :
తల్లితండ్రుల శ్రమ, వారి ఆశయం వృధా కాకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రణాళికా బద్దంగా చదివితే తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. శుక్రవారం స్థానిక యస్ఏపి కళాశాలలో యస్సి, యస్టి నిరుద్యోగ యువతి యువకులకు గ్రూప్ ఉద్యోగాల కొరకు నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి స్టడీ మెటీరియల్ అందజేశారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా యస్సి, యస్టి సంక్షేమ శాఖల ద్వారా నిరుద్యోగ యువతి యువకులకు గ్రూప్ పరీక్షల ఉచిత శిక్షణ అందించి వారు మంచి ఉద్యోగాలు సాధించేలా కృషి చేయడం జరుగుతుందన్నారు.  శిక్షణలో భాగంగా ఐదు సబ్జెక్టుల స్టడీ మెటీరియల్ తో పాటు సెలబస్ ను అర్థం చేసుకొని ప్రణాళిక బద్దంగా చదివి పరీక్షలు రాయాలని కలెక్టర్ సూచించారు.  తల్లిదండ్రుల శ్రమ వృధా కాకుండా రెండు నెలలు కష్టపడి చదివి విజయం సాధించాలని సూచించారు. 
ఈ సందర్బంగా యస్ఏపి స్టడీ సెంటర్లో అందుతున్న శిక్షణ, సేవలపై యువకులను అడుగగా, శిక్షణ తరగతులు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని, దీనితో పాటు మధ్యాన్న భోజనం  బాగుందని ఎక్సపర్టు ఫాకల్టీ లతో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, నోటు బుక్కులు, న్యూస్ పేపర్లు, స్టడీ మెటీరియల్ అందించడం జరుగుటిందన్నారు. శిక్షణకు ప్రతి ఒక్కరు సమయ పాలన, క్రమశిక్షణ తో ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు శ్రద్ధతో చదువుకోవడం జరుగుతుందని కలెక్టర్ కు వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో యస్ఏపి కళాశాల ప్రిన్సిపాల్ మందారిక, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి మల్లేశం, గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటాజి, సీనియర్ లెక్చరర్ సోమన్న, సహాయ సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఉమా శంకర్ తదితరులు పాల్గొన్నారు.