రైతులు ఋణ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

Published: Wednesday June 30, 2021

మంచిర్యాల జిల్లా ప్రతినిధి, జూన్ 29, ప్రజాపాలన : జిల్లాలోని చిన్న, సన్నకారు రైతుల ఆర్థికాభివృద్ధి, అభ్యున్నతి కోసం ప్రభుత్వం అందిస్తున్న ఋణ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ట్రైనీ కలెక్టర్ ప్రతిభా సింగ్ తో కలిసి వివిధ బ్యాంక్ అధికారులు, సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 30వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి ఖరీఫ్ లక్ష్యంగా నెలకు 350 కోట్ల రూపాయల చొప్పున మూడు నెలలకు 1000 కోట్ల రూపాయల పంట రుణాలు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయా బ్యాంకుల వారిగా కేటాయించిన లక్ష్యాలను ప్రణాళికబద్దంగా సాధించేలా అధికారులు కృషి చేయాలని తెలిపారు. మార్చి 31, 2021 నాటికి 6 వేల 97 కోట్ల రూపాయల డిపాజిట్లు ఉండగా 4 వేల 365 కోట్ల రూపాయలు అడ్వాన్గా అందించడం జరిగిందని పేర్కొన్న కలెక్టర్ వ్యవసాయాభివృద్ధి కోసం 1 వేయి 819 కోట్ల రూపాయలు, సూక్ష్మ తరహా పరిశ్రమల కోసం 239 కోట్ల రూపాయలు అందించడం జరిగిందని తెలిపారు. 92 కోట్ల రూపాయలు విద్యా రుణాలు లక్ష్యం కాగా 4 కోట్ల 48 లక్షల రూపాయలు, 184 కోట్ల రూపాయలు గృహ రుణాలు లక్ష్యం కాగా 35 కోట్ల 38 లక్షల రూపాయలు అందించడం జరిగిందని తెలిపారు. ప్రధానమంత్రి ముద్ర రుణ సదుపాయం క్రింద 2020-21 సంవత్సరానికి గాను 7 వేల 384 ఖాతాలకు 69 కోట్ల రూపాయలు మంజూరు కాగా 67 కోట్ల రూపాయలు అందించడం జరిగిందని, ప్రధానమంత్రి స్టాండ్ అప్ ఇండియా పథకం క్రింద 70 యూనిట్లకు గాను 18 కోట్ల రూపాయలు మంజూరు కాగా 17 కోట్ల రూపాయలు అందించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి జన్ ధన్ భీమా యోజన పథకం క్రింద జిల్లాలో 1 లక్షా 32 వేల 769 ఖాతాలు తెరువడం జరిగిందని తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను 89 వేల 853 మంది రైతులకు 1 వేయి 68 కోట్ల రూపాయల పంట రుణాలు అందించడం జరిగిందని, స్వయం సహాయక సంఘాల అభివృద్ధికి గాను 8 వేల 53 సంఘాలకు 309 కోట్ల రూపాయల రుణం అందించడం జరిగిందని తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను పంట రుణాలకు గాను 1 వేయి 713 కోట్ల రూపాయలు, వ్యవసాయ దీర్ఘకాలిక రుణాలకు గాను 805 కోట్ల రూపాయలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి కోసం 541 కోట్ల రూపాయలు, ప్రాధాన్యత రంగాల అభివృద్ధి కోసం 3 వేల 409 కోట్ల రూపాయలుగా మొత్తం రుణ లక్ష్యం 3 వేల 669 కోట్ల రూపాయలుగా నిర్ణయించడం జరిగిందని తెలిపారు. ప్రధానమంత్రి స్వనిధి క్రింద రుణ సహాయం పొందిన వారు సక్రమంగా తిరిగి చెల్లించి తిరిగి రుణం పొందవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డి.జి.ఎం. అరుణ్కుమార్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్రెడ్డి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ సుబ్రహ్మణ్యం, జిల్లా వ్యవసాయ అధికారి వీరయ్య, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేషాద్రి, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ హవేలిరాజు, ఎస్.సి. కార్పొరేషన్, బి.సి. కార్పొరేషన్, జిల్లా పరిశ్రమల శాఖ, వివిధ బ్యాంక్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.