సోనియా గాంధీ పై ఈ.డి. వేధింపు లు ఆపాలి

Published: Thursday July 28, 2022

మంచిర్యాల టౌన్, జూలై 27, ప్రజాపాలన:  సోనియా గాంధీ పై అకారణంగా విచారణ పేరుతో  ఈ.డి. వేధింపులకు పాల్పడడాన్ని నిరసిస్తూ మంచిర్యాలలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. జాతీయ కాంగ్రెస్ కమిటీ పిలుపుమేరకు మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ,కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ సూచనల మేరకు మంచిర్యాలలోని గాంధీ పార్క్ లో గాంధీ ,నెహ్రూ ల విగ్రహం ముందు కాంగ్రెస్ పార్టీ నేతలు , కార్యకర్తలు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం సోనియా, రాహుల్ గాంధీ లపై కక్ష కట్టిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎదుగుతున్న క్రమంలో అణచివేయాలనే ఉద్దేశంతో పనికిరాని ఆరోపణలు చేస్తూ ఈ.డి. ని అడ్డం పెట్టుకొని విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు,వెంటనే ఈ డి. వేదింపులు ఆపాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అన్నింట విఫలమైందని అందుకే కాంగ్రెస్ పై అసత్య ఆరోపణలు చేస్తుందని ఆయన విమర్శించారు. జీఎస్టీ ,ధరల పెరుగుదల,నిరుద్యోగం ,వ్యవసాయ రంగం ఇలా అన్ని రంగాల్లో ఎన్.డి.ఏ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు.  వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం కుప్ప కూలి పోవడం ఖాయమని అన్నారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల,చెన్నూర్,కాంగ్రెస్ పార్టీ,మున్సిపల్ కౌన్సిలర్లు,ఎంపిటిసిలు, నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.