పల్లె ప్రగతి లక్ష్యంగా కృషి : ఎంపీవో నాగరాజు

Published: Saturday June 19, 2021
వికారాబాద్ జూన్ 18 ప్రజా పాలన బ్యూరో : పల్లెల అభివృద్ధే దేశ ఆర్థిక అభివృద్ధికి పట్టుగొమ్మలని వికారాబాద్ ఎంపీఓ నాగరాజ్ అన్నారు. శుక్రవారం వికారాబాద్ మండల పరిధిలోని నారాయణపూర్, ద్యాచారం, బురాన్ పల్లి, పాతూరు, గొట్టుముక్కల, కామారెడ్డి గూడ, పీలారం, సర్పన్ పల్లి తదితర గ్రామాలలో అంటు వ్యాధులు పారిశుద్ధ్యం పనులపై గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎంపిఒ మాట్లాడుతూ.. హరితహారం పారిశుద్ధ్యాన్ని మెరుగు పరచుటకు గ్రామ సభలు ఏకగ్రీవంగా తీర్మానించారని వివరించారు. నారాయణపూర్ గ్రామంలో గత సంవత్సరం నాటిన కొన్ని మొక్కలను పశువులు, మేకలు విచ్చలవిడిగా రోడ్లపై విడిచిపెట్టడంతో తిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకముందు ఎవరివైన పశువులు, మేకలు హరిత హారంలో నాటిన మొక్కలను నష్ట పరిచినచో ఆ యజమానికి 200 రూపాయల చొప్పున జరిమానా విధించబడునని గ్రామ సభ తీర్మానం చేశారు. ఉపాధి హామీ పథకంలో పశువుల పాకలు, ఇంటి ఆవరణలో స్థలము లేనివారికి సామూహికంగా ప్రభుత్వ భూమిలో నిర్మించుటకు గ్రామ సభ తీర్మానం చేయనైనదని వివరించారు. ఈ కార్యక్రమంలో నారాయణ పూర్ ప్రత్యేక అధికారి ఎంపీవో నాగరాజు, ద్యాచారం సర్పంచ్ ఎల్లన్నోల్ల అంజయ్య, బురాన్ పల్లి సర్పంచ్ మమత సాయికృష్ణ గౌడ్, దొడ్ల లలిత నర్సింహా రెడ్డి, పట్లే వెంకటేశ్వర్లు ముదిరాజ్, సామల పురుషోత్తం రెడ్డి, పీలారం సర్పంచ్ కొంపల్లి భారతమ్మ నర్సిములు, సర్పన్ పల్లి సర్పంచ్ షాకేరా బేగమ్ ఫకీరా ఖాన్, తదితర గ్రామాల సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.