ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలను పకడ్బంధీగా నిర్వహించాలి. ..జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన

Published: Saturday July 23, 2022
మంచిర్యాల బ్యూరో, జులై22, 
ప్రజాపాలన :
 
జిల్లాలో ఆగస్టు 1 నుండి 10వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల సప్లమెంటరీ పరీక్షలను సంబంధిత శాఖల సమన్వయం తో పకడ్బంధీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని జిల్లా అదనపు కలెక్టర్ చాంబర్ లో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శైలజతో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు 1, 2, 3, 4, 5, 6, 8, 10 తేదీలలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గం||ల వరకు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం 2.30 గం||ల నుండి సాయంత్రం 5.30 గం||ల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థినీ, విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పరీక్షల నిర్వహణ కొరకు జిల్లాలో 18 పరీక్ష కేంద్రాలు మంచిర్యాలలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, మిమ్స్, ఎస్.ఆర్.ఆర్., ప్రతిభ, అల్ఫోర్స్, నేషనల్ (ఒకేషనల్) జూనియర్ కళాశాలల్లో, మందమర్రిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, కార్మెల్ జూనియర్ కళాశాల, కాసిపేట, చెన్నూర్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, బెల్లంపల్లిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, టి.ఎస్.డబ్ల్యు. ఆర్.ఎస్./ జె.సి. సి.ఓ. ఈ. బాలుర కళాశాల, జైపూర్, జన్నారం, దండేపల్లిలలోని ప్రభుత్వ జూనియర్ కళశాలలు, లక్షెట్టిపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, టి.ఎస్.ఎస్.డబ్ల్యు. బాలికల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేయం జరిగిందని తెలిపారు. ప్రధమ సంవత్సరం పరీక్షలకు 3 వేల 744 మంది జనరల్, 429 మంది ఒకేషనల్, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 1 వేయి 887 మంది జనరల్, 382 మంది ఒకేషనల్ విద్యార్థులు హాజరు కానున్నారని, 1 ఫ్లయింగ్ స్వ్కాడ్, 2 సిట్టింగ్ స్వ్కాడ్ బృందాలను నియమించడం జరిగిందని తెలిపారు. పోలీసు శాఖ పరిధిలో ఏర్పాటు చేసిన స్టోరేజ్ పాయింట్లు, 18 పరీక్ష కేంద్రాల వద్ద, ప్రశ్నాపత్రాలు, జవాబుపత్రాలు తరలింపు సమయంలో కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలు చేపట్టాలని, పరీక్ష సమయంలో కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచేలా సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. విద్యార్థులు పరీక్ష సమయానికి కేంద్రాలకు చేరుకునేలా టి.ఎస్.ఆర్.టి.సి. అధికారులు బస్సులను నడిపించాలని, పరీక్ష కేంద్రాల వద్ద వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలను నియమించి ఓ.ఆర్.ఎస్., అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని తెలిపారు. పరీక్ష సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగకుండా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని, అదే విధంగా నిరంతరంగా ఇంటర్నెట్ సరఫరా అయ్యేలా సంబంధిత అధికారులు దృష్టి సారించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ, పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area