*పంచాయతీ కార్యదర్శుల ప్రొబేషన్ పీరియడ్ పూర్తి* -క్రమబద్ధీకరణ ప్రక్రియను వెంటనే చేపట్టాలని, -

Published: Thursday April 13, 2023

చేవెళ్ల ఏప్రిల్ 12, (ప్రజాపాలన ):-

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ప్రొబేషనరీ కాలం నాలుగు సంవత్సరాలు పూర్తి అయినందున తమ ఉద్యోగాల క్రమబద్ధీకరణ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కోరుతూ టీజేపీఎస్ఏ రాష్ర్ట కమిటీ పిలుపు మేరకు చేవెళ్ల మండల కేంద్రంలో చేవెళ్ల ఎంపీపీ ఎం. విజయలక్ష్మి రమణారెడ్డి గారికి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు బుధవారం వినతి పత్రం అందజేశారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరినొకరు స్వీట్లు పంచుకున్నారు. ప్రభుత్వం 2019 ఏప్రిల్ 12న ప్రతి పంచాయతీ కి ఒక కార్యదర్శి ఉండాలనే సత్సంకల్పంతో 9355 పంచాయతీ కార్యదర్శులను నియమించిన విషయం తెలిసిందే. నొటిఫికేషన్ ప్రకారం మూడు (3) సంవత్సరాలకే క్రమబద్ధీకరించాల్సి ఉండగా, జీవో నెం. 26 జారీతో మరో సంవత్సరం ప్రొబేషన్ పెంచారు. కాగా, ఏప్రిల్ 12 తో నాలుగేళ్లు పూర్తి చేసుకున్న కార్యదర్శులను వెంటనే క్రమబద్ధీకరించాలని పంచాయతీ కార్యదర్శులు కోరారు. అలాగే ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల పని కాలాన్ని సర్వీసు కాలంగా పరిగణిస్తూ వారి ని రెగ్యులరైజ్ చేయాలని వివరించారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా చొరవ చూపాలని ఎంపీపీ విజయలక్ష్మిని కార్యదర్శులు విన్నవించారు.  ఈ కార్యక్రమంలో సీనియర్ పంచాయతీ కార్యదర్శులు, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.