ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

Published: Friday August 26, 2022
మంచిర్యాల బ్యూరో,  ఆగస్టు 25, ప్రజాపాలన :
 
జిల్లాలోని 16 మండలాల్లో ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని  జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నరేందర్, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారి శ్యామలాదేవి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి.శేషాద్రితో కలిసి ఆదర్శ గ్రామాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పల్లెప్రగతిలో భాగంగా గ్రామసభల ద్వారా గ్రామపంచాయతీలలో చేసిన తీర్మానం 164 గ్రామపంచాయతీలను ఓ.డి.ఎఫ్. ప్లస్ ఆదర్శ గ్రామాలుగా ప్రకటించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని, కమిటీ సభ్యులు వారికి కేటాయించిన మండలాలలోని ప్రతి గ్రామపంచాయతీ పరిధిలోని ఇండ్లు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు, వినియోగం, మురుగునీటి తరలింపు, ఘన, ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణ అంశాలపై సెప్టెంబర్ 15వ తేదీ లోగా పరిశీలన పూర్తి చేసి ప్రభుత్వ మాడ్యూల్లో అప్లోడ్ చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం చేతుల పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రతపై అవగాహన కల్పించే గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.