మరియమ్మ లాకప్ డెత్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

Published: Saturday June 26, 2021

కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం దినకర్
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి జూన్ 25 (ప్రజాపాలన) : ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్ల గూడెం గ్రామానికి చెందిన దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం దినకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దినకర్ మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ లో ఇటీవల దొంగతనం కేసు మోపబడిన అంబటిపూడి మరియమ్మ అనే దళిత మహిళ పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్ కు గురైన సంఘటనపై ప్రభుత్వం తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి, బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసుతో పాటు అత్యాచారం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. బాధిత కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి మరియమ్మ లాకప్ డెత్, ఆమె కుమారుడు ఉదయ్ లను అతి కిరాతకంగా దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి 3 ఎకరాల ప్రభుత్వ భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు తో పాటు, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకులు జాడి తిరుపతి, దుర్గం కైలాస్ లు ఉన్నారు.