షర్మిల నిరుద్యోగ దీక్షకు తరలి రావాలి

Published: Monday July 19, 2021
ప్రజాపాలన ప్రతినిధి మధిర జులై 18 వైయస్సార్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకులు వైఎస్ షర్మిల ఈ నెల 20వ తేదీన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గంగదేవిపాడు గ్రామంలో నిర్వహిస్తున్న నిరుద్యోగ దీక్షకు జిల్లా నలుమూలల నుండి  నిరుద్యోగులు తరలిరావాలని వైఎస్ఆర్ తెలంగాణ ఉమ్మడి ఖమ్మం జిల్లా సమన్వయకర్తలు మద్దెల ప్రసాదరావు కోరారు. ఆదివారం మధిర నియోజకవర్గంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు పలు మండలాల్లో పర్యటించి నిరుద్యోగులను కలిసి వైఎస్ షర్మిల చేపట్టిన నిరుద్యోగ దీక్ష గురించి వివరించారు. ఈ సందర్భంగా మద్దెల ప్రసాద రావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకులు వైయస్ షర్మిల ఈనెల 20న పెనుబల్లి మండలం గంగదేవి పాడు గ్రామంలో నిరుద్యోగ దీక్ష చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని కలలుగన్న నిరుద్యోగులను ముఖ్యమంత్రి కెసిఆర్ మోసం చేశారన్నారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో లక్షా 90 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగుల ఖాళీలతో కలిపి రాష్ట్రంలో మూడు లక్షల 50 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగ ప్రకటన ఇవ్వకపోవడంతో రాష్ట్రంలో రోజు రోజుకి నిరుద్యోగులు మనోవేదనతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం చెందిన నిరుద్యోగి సానిక నాగేశ్వరావు ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వైయస్ షర్మిల ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. దీనిలో భాగంగా ఈ నెల 20వ తేదీ మంగళవారం ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి నాగేశ్వరరావు సొంత గ్రామమైన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గంగదేవిపాడు గ్రామంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరుద్యోగ దీక్ష చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ దీక్షలో నిరుద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ ముదిగొండ, చింతకాని, బోనకల్లు, మధిర, ఎర్రుపాలెం మండల అధ్యక్షులు సామినేని రవి, వాక వీరారెడ్డి, మౌలానా, ఐలూరి ఉమా మహేశ్వర రెడ్డి, మల్లారెడ్డి ఆనం లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.