మహనీయుల ఆశయసాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి

Published: Wednesday April 06, 2022
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
వికారాబాద్ బ్యూరో 05 ఏప్రిల్ ప్రజాపాలన : మహనీయుల ఆశయ సాధనకు కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భారతరత్న డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ జయంతి ఉత్సవాలు కమిటీ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డితో పాటు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నిఖిల,  వికారాబాద్, చేవెళ్ల శాసనసభ్యులు మెతుకు ఆనంద్, కాలె యాదయ్య, జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయ కుమార్, ఎం పీ పీ చంద్రకళ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళి కృష్ణ, బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద పటేల్ లు పాల్గొని పూలమాలలతో నివాళులర్పించారు. మహనీయుల జయంతి ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర విద్యా శాఖ మాత్యులు పి.సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్ మాసంలో బాబు జగ్జీవన్ రామ్, మహాత్మ జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహానీయులు జన్మించడం పండగ వాతావరణాన్ని సంతరించుకుంటుందని ఆమె అన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి తోడ్పాటు నందించడం తోపాటు ఈ దేశాన్ని ఎన్నో రకాల సేవలు చేయడం జరిగిందని ఆమె కొనియాడారు. మహనీయుల చూపిన బాటలో నడుస్తూ వారిని ఎప్పుడూ స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ఆర్థిక అభివృద్ధికి గాను ప్రభుత్వం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని మంత్రి అన్నారు. ప్రతి నిరుపేద దళిత కుటుంబాలు లక్షాధికారులను చేసే దిశగా ప్రభుత్వం దళిత బంధు అనే పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేయడం మొదలు పెట్టింది అని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో జోనల్ విధానాన్ని ప్రవేశపెట్టి జిల్లా వాసులకే స్థానిక ఉద్యోగాలు లభించాలనే సదుద్దేశంతో రాష్ట్రంలో 80 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ ప్రక్రియను మొదలు పెట్టడం జరిగిందని మంత్రి తెలిపారు.  నిరుద్యోగ యువత ఇట్టి నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలు పొందేందుకు గాను నియోజకవర్గాల వారీగా పూర్తి ఉచిత శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి తెలిపారు. నియోజకవర్గ స్థాయిలలో స్థానిక శాసనసభ్యులు ఉచిత శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నారని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఎన్నెపల్లి చౌరస్తాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూతన విగ్రహ ఏర్పాటుకు అంచనాలను నివేదించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా కేంద్రంలో శాశ్వత స్టడీ సర్కిల్ కు ప్రతిపాదించడం జరిగిందని దీనికి సంబంధించి త్వరలోనే శంకుస్థాపన చేపట్టడం జరుగుతుంది మంత్రి అన్నారు. ధరణి  సమస్య వల్ల చిన్న చిన్న రైతులు ఇబ్బందులు పడకుండా కలెక్టర్ కు స్వయంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ వివక్షకు గురవుతున్నట్లుగా వస్తున్న ఫిర్యాదులను పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ కోటి రెడ్డికి మంత్రి సూచించారు. వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ సుదీర్ఘకాలంగా పార్లమెంట్ సభ్యులుగా కొనసాగారని అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ కేంద్రంలో వివిధ శాఖల్లో పనిచేస్తూ తనదైన ముద్ర వేసుకోవడం జరిగిందని అదేవిధంగా ఎన్నో కార్మిక చట్టాలు తీసుకురావడానికి కృషి చేశారని ఆయన అన్నారు. మహాత్మా గాంధీ,  మహాత్మ జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ లాంటి మహనీయులను కొందరికే పరిమితం చేస్తున్నారని వీరు అన్ని వర్గాలకు నాయకులని తెలిపారు. చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ స్వాతంత్ర్య ఉద్యమంలో తన పాత్ర పోషిస్తూనే వివక్షకు గురి అవుతున్న ప్రజల కోసం పోరాటం చేశారని అన్నారు. మహానీయుల చరిత్రలను వెలుగులోకి తీసుకురావడానికి గ్రామస్థాయిలో ప్రజలను చైతన్య పరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. చిన్న చిన్న మనస్పర్థల విషయాలకు స్వస్తి పలకాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా జిల్లాలో కులాంతర వివాహాలు చేసుకున్న నాగులపల్లి సుచిత్ర భర్త ఉప్పరి సాయి కుమార్, బీర్ల మహేశ్వరి భర్త తోల్కట్ట రవీందర్ ఇరువురు జంటలకు 2 లక్షల 50 వేల చొప్పున ప్రోత్సాహక పత్రాలను మంత్రి చేతుల మీదుగా అందించారు. జయంతి ఉత్సవాల అధ్యక్షులు సంగీతం రాజలింగం అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఆడిషన్ కలెక్టర్ మోతిలాల్, వికారాబాద్ రెవిన్యూ డివిజనల్ అధికారి విజయ కుమారి, షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి మల్లేశం, ఎస్సీ కార్పొరేషన్ అధికారి బాబు మోజెస్, గిరిజన అభివృద్ధి అధికారి కోటాజి, బీసీ అభివృద్ధి అధికారి ఉపేందర్, జయంతి ఉత్సవాల కమిటీ కార్యదర్శి రవీందర్, సభ్యులు పెండ్యాల అనంతయ్య, భూ మనోళ్ల కృష్ణ, ఎం ఆర్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు ఆనందం, పెద్ది అంజయ్య, మల్లేష్, శివరాజ్, అడ్వకేట్ ఆనందం,  మహిపాల్, దళిత సంఘాల సీనియర్ నాయకులు భీమయ్య, అనంతయ్య, రామస్వామి లతో పాటు వివిధ పార్టీల నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.