హైకోర్టు ఉత్తర్వులతో హరివిల్లు పునః ప్రారంభం

Published: Tuesday October 25, 2022
 హరివిల్లు వ్యవస్థాపకుడు గంగాధర్ రావు
వికారాబాద్ బ్యూరో 23 అక్టోబర్ ప్రజా పాలన : హైకోర్టు ఉత్తర్వులతో హరివిల్లును త్వరలో పునః ప్రారంభం చేయనున్నామని హరివిల్లు వ్యవస్థాపకుడు గంగాధర్ రావు అన్నారు. జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేశ్వర్ రెడ్డి హరివిల్లు పై అవాస్తవ ఆరోపణలు చేశారని విమర్శించారు. ఆదివారం హరివిల్లులో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని హరివిల్లు వ్యవస్థాపకుడు గంగాధర్ రావు మాట్లాడుతూ అనంతగిరి కొండల సమీపంలో హరివిల్లును స్థాపించి పర్యాటకులను సంతోషపెట్టడమే లక్ష్యం అన్నారు. బతుకు బతికించు అనే ఆలోచనతో స్థానికులకే ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు నా మానస పుత్రిక అయిన హరివిల్లును కొనసాగిస్తున్నానన్నారు. లాభాపేక్ష లేకుండా హరివిల్లు కొనసాగిస్తూ సమీప గ్రామాల నిరుద్యోగ సమస్యను కొంతలో కొంతైనా తీరుస్తున్నాననే సంతోషం కలుగుతుందని వివరించారు. పర్యాటకులకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించడమే లక్ష్యమని వెల్లడించారు. హరివిల్లును స్థాపించాలని ఎన్నో సంవత్సరాల నుండి నా మనసులో నుండి వచ్చిన ఆలోచన అని చెప్పారు. అందుకు తగిన చక్కని ఆహ్లాదకర వాతావరణం అనుకూలంగా ఉండే ప్రాంతం అనంతగిరి కొండల సమీపంలో ఉన్న కొండాపూర్ గ్రామానికి చెందిన భూములను కొన్నాను అన్నారు. 17.7 ఎకరాల భూమిని హరివిల్లు అవసరాలకు ఉపయోగిస్తున్నారని స్పష్టం చేశారు. హరివిల్లును పర్యాటకుల ఆదరణ పొందేందుకు అహర్నిశలు కష్టపడుతున్నానని స్పష్టం చేశారు. హరివిల్లుకు పర్యాటకుల సందర్శన ఎక్కువ మొత్తంలో అయితే వచ్చే ఆదాయాన్ని హరివిల్లు అభివృద్ధికి ఉపాధి అవకాశాలు పెంచేందుకు కృషి చేస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. హరివిల్లులో ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరిగినా వెంటనే పోలీసులు, ఎక్సైజ్, అటవీ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు సందర్శించి పరిశీలించుకోవచ్చని తెలిపారు. జిల్లా అధికారులు ఎవరు వచ్చినా వారిని సకల మర్యాదలతో సత్కరించే బాధ్యత నాదని గుర్తు చేశారు. హరివిల్లుకు సంబంధించి జిల్లా అధికారులు ఎలాంటి పక్కా సమాచారం లేకుండా రాకపోకలకు ఆటంకం కలిగించడం భావ్యం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. హరివిల్లు కు సంబంధించి ఎలాంటి సమాచారం కావాలని జిల్లా అధికారులు అడిగితే వెంటనే పక్కా ఆధారాలతో మీ ముందు ఉంటానని భరోసా కల్పించారు. పరోపకారాయ ఫలంతివృక్షః పరులకు సహాయ పడాలనే లక్ష్యమే హరివిల్లు స్థాపన. ఎంత కూడా పెట్టామన్నది కాదు ఎంతవరకు నిరుద్యోగ సమస్యను తీర్చడంలో తన వంతు పాత్ర ఎంత అనే ఆలోచనే హరివిల్లు లక్ష్యం. హైకోర్టు ఉత్తర్వులతో హరివిల్లు పునః ప్రారంభించుటకు అనుమతి లభించిందని హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు ఉత్తర్వులను మీడియాకు చూపిన హరివిల్లు వ్యవస్థాపకుడు గంగాధర్ రావు.