సమాజ సేవలో అక్షర కౌముది సేవలు అమోఘం

Published: Friday June 25, 2021
అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహ రెడ్డి
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : సమాజ మనుగడకు సాహిత్యం ప్రభావం ఉంటేనే అన్ని కళల్లో రాణిస్తారని, సమాజ హితాన్ని కోరేది సాహిత్యమేనని పలువురు సాహితీ వేత్తలు పేర్కొన్నారు. బుధవారం అక్షర కౌముది సంస్థ ద్వితీయ వార్షికోత్సవ ముగింపు సభను అంతర్జాల వేదిక ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ సాహిత్యాన్ని పెంపొందించడమే కాకుండా సామాజిక సాంస్కృతిక రంగాల్లో సేవలు అందిస్తున్న అక్షర కౌముది సంస్థను అభినందించారు. ముఖ్యంగా విధ్యార్ధులను తీర్చిదిద్దాలనే సత్ సంకల్పంతో ముందుకు వెళుతున్న సంస్థకు చేయుతనందిస్తామని అన్నారు. ప్రాచీన కవులు రచయితల సాహిత్యంను చదివితే నవతరం కవులు రాణిస్తారని వారు అన్నారు. సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు నందిని సిధారెడ్డి మాట్లాడుతూ నేడు పుంఖాను పుంఖాలుగా వస్తున్న కవిత్వంలో వస్తూ ప్రాధాన్యత కొరవడుతోందనీ అన్నారు. నిక్కచ్చిగా కవిత్వం రాయలంటె అభ్యసనం, శ్రవణం, శిక్షణ, ఎంతో అవసరం అని వారు అన్నారు. అక్షర కౌముది సంస్థ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా జాతీయ స్థాయిలో అంతర్జాల కవి సమ్మేళనం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉన్నదని వారు పేర్కొన్నారు. కవి సినిగేయ రచయిత సాధనాల వెంకట స్వామి నాయుడు మాట్లాడుతూ ఒక స్నేహ పుష్పం వికసించి అక్షర కౌముది సంస్థగా ఆవిర్భవించి సాహిత్య సామాజిక సేవా పరిమళాలను అందించడం అభినందనీయమని అన్నారు. ప్రస్తుతం ఉన్నా కాలమాన పరిస్థితుల్లో ఒక రంగంలో రాణించాలి అంటే ఎంతో శ్రమతో కూడుకున్నది. నేడు ఈ సంస్థ మూడు రంగాల్లో విభిన్న కార్యక్రమాలు చేపట్టడం ఎంతో హర్షణీయం అన్నారు. తెలంగాణ రాష్ట్ర రచయితల సంఘం అధ్యక్షులు  నాలేశ్వరం శంకరం మాట్లాడుతూ కవిత్వం ఎంత రాసినా తీరని దాహం లాంటిదని  అన్నారు. రోజు రోజుకు సాహిత్య రచనలో విభిన్న ప్రక్రియలను నూతనత్వంతో కవులు రాయడం వారికి అక్షర కౌముది సంస్థ చేయూత నివ్వడం ఎంతో సంతోషదాయకం అన్నారు. అక్షర కౌముది సంస్థ వివిధ స్థాయిలో పాఠశాల విద్యార్థులకు వక్తృత్వ, పాటల పోటీలు నిర్వహించి, విద్యార్థుల సృజనాత్మక శక్తిని వెలికి తీయడం, వారికి ప్రశంస పత్రాలు అందించడం అభినందనీయం అన్నారు. ప్రముఖ కవయిత్రి, రచయిత్రి, రేడియో వ్యాఖ్యాత ఐనం పూడి శ్రీలక్ష్మి మాట్లాడుతూ నేటి బాల బాలికలే రేపటి భావి తరానికి వారదులని అన్నారు. బాలసాహిత్యం ను పాఠశాల స్థాయిలో బోధిస్తే విద్యార్థుల్లో ఆత్మ స్థార్యం, సృజనాత్మక శక్తిని పెంపొందించ వచ్చన్నారు. అక్షర కౌముది సంస్థ అధ్యక్షులు తులసి వెంకట రమణా చార్యులు మాట్లాడుతూ సాహిత్యంలో రానించాలి అంటే అలంకారాలు ఉండాలి. ప్రాచీన కవులు రచయితలు అందరూ వారి వారి రచనల్లో చక్కని చీక్కనైనా కథ, నేపథ్యంతో శైలి, వర్ణన ఉంటుంది. నేడు ఆధునిక కాలంలో వస్తున్న కవిత్వంలో ఇంకా ఎన్నో మార్పులు రావాలని వారు అన్నారు. చిత్రకారుడు కుంచే ద్వారా చిత్రాన్ని నిర్మిస్తే. కవులు తమ భావాలని అక్షర రూపంలో చక్కని అక్షర శిల్పాన్ని నిర్మిస్తారని అన్నారు. సాహిత్య, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో విశేష కృషి చేసిన వారికి సంస్థ అధ్యక్షులు తులసి వెంకట రమణా చార్యులు ,ప్రధాన కార్యదర్శి మూర్తి శ్రీదేవి వారి తల్లి తండ్రుల పేరు మీద స్మారక పురస్కారాలను ప్రకటించారు. సామాజిక రంగంలో కృషి చేసిన ప్రముఖ వైద్యనిపుణులు డాక్టర్ నాగేశ్వర రావుకు తులసి శేషాచార్యులు ఆండాలు పేరునా స్మారక పురస్కారం ప్రకటించారు. సాహిత్య రంగంలో కృషి చేసిన డాక్టర్ ఐనం పూడి శ్రీలక్ష్మి గురునాధం, సౌభాగ్య పేరునా స్మారక పురస్కారం. సాంస్కృతిక రంగాల్లో విశేష కృషి చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రంగస్థల కళాకారుడు ఆమని కృష్ణ కు పురస్కారం ప్రకటించారు. త్వరలో సంస్థ ద్వారా జరిగే సభలో సన్మానం, జ్ఞాపిక ప్రశంసాపత్రం అందజేస్తామని అన్నారు. వివిధ స్థాయిల్లో పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో పాల్గొనీ విజేతలుగా నిలిచిన వారికి త్వరలోనే జ్ఞాపిక ప్రశంసాపత్రం అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత విద్వాంసురాలు దేవి మ్యూజిక్ అకాడమీ అద్యక్షురాలు దేవి, కవయిత్రి రచయిత్రి వురిమళ్ళ సునంద, కవులు పక్కి రవి శేఖర సత్యనారాయణ మూర్తి ,కొంపెల్లి రామయ్య, దాసరి మోహన్, కట్టేకొల చిన నరసయ్య, కొత్తపల్లి కృష్ణ రావు, మోటూరి నారాయణ రావు, సంస్థ ప్రధాన కార్యదర్శి మూర్తి శ్రీదేవి కార్య వర్గ సభ్యులు మేనావత్ రాందాస్, తాళ్లూరి వెంకట కృష్ణ, ముదిగొండ సంతోష్ కుమార్ శర్మ, గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాద్, గడ్డం వెంకట రమణ, మాధవి తదితరులు పాల్గొన్నారు.