ఎర్రవల్లి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి : జిల్లా కలెక్టర్ నిఖిల

Published: Thursday March 03, 2022

వికారాబాద్ బ్యూరో 02 మార్చి ప్రజాపాలన : ఎర్రవల్లి గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా  తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ నిఖిల పిలుపునిచ్చారు. బుధవారం వికారాబాద్ మండల పరిధిలోని ఎర్రవల్లి గ్రామంలో కెపిఎఫ్ (కృష్ణ ప్రసాద్ ఫౌండేషన్) ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ మల్లమ్మ హనుమంతు సమక్షంలో విశ్రాంత ఐపిఎస్ అధికారి కృష్ణప్రసాద్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్, నైపుణ్య శిక్షణ వంటి కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాలికల విద్యాభ్యాసం అర్ధాంతరంగా ఆగిపోకుండా 36 సైకిళ్ళను పంపిణీ చేయడం అభినందనీయమని కొనియాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కెపిఎఫ్ వ్యవస్థాపకుడు విశ్రాంత ఐపిఎస్ అధికారి కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఆరోగ్యం, విద్య, నైపుణ్యం, లైవ్లీహుడ్ ప్రధాన నాలుగు లక్ష్యాలను సాధించేందుకు కెపిఎఫ్ ను స్థాపించామని పేర్కొన్నారు. అన్ని రంగాలలో వెనుకబడిన ఎర్రవల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నామని వివరించారు. పాఠశాల అభివృద్ధికి డ్యూయల్ బెంచీలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఎర్రవల్లి గ్రామానికి సమీపంలో ఉన్న చెంచుపల్లిని అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉందని గుర్తు చేశారు. గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. బాలబాలికలకు, యువతకు, మహిళలకు పనులలో నైపుణ్య శిక్షణను అందిస్తే స్వయం ఆర్థికాభివృద్ధి చెందుతారని ఆకాంక్షించారు. దేశంలో పూర్తిగా వెనుక బడిన 12 జిల్లాలను దత్తత తీసుకున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ క్రిష్ణన్, ఎంపిడిఓ సత్తయ్య, మాజీ సర్పంచ్ సుభాన్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, రాంచందర్, రవీందర్, రామేశ్వర్, నర్సిములు, తులసీదాసు, హనుమంతు, లక్ష్మయ్య, భీమయ్య వార్డు మెంబర్లు తుల్జారాం లక్ష్మి మహిళి సంఘం అధ్యక్షురాలు, ప్రధానోపాధ్యాయులు నీల్యా గ్రామస్థులు పాల్గొన్నారు.