రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న పాలకులు

Published: Tuesday June 14, 2022
విప్లవ రచయితల సంఘం రాష్ట్ర నాయకురాలు విమలక్క  
*వైరాలో ఘనంగా ముగిసిన పీవోడబ్ల్యూ జిల్లా జనరల్ కౌన్సిల్ సమావేశం  
వైరా జూన్ 13: మహిళలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను పాలకులు కాలరాస్తున్నారని విప్లవ రచయితల సంఘం రాష్ట్ర నాయకురాలు విమలక్క ఆరోపించారు. వైరా పట్టణంలో సోమవారం జరిగిన ప్రగతి శీల మహిళా సంఘం ఖమ్మం జిల్లా జనరల్ కౌన్సిల్ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొని ఆమె ప్రారంభోపన్యాసం చేశారు. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలు అనేక రకాల హింసకు గురవుతున్నారని, సృష్టించిన సంపదలో రెండు శాతం వాటా కూడా దక్కడం లేదన్నారు. ఆడపిల్ల అంటే వస్తువుగా మిఠాయి గా అనుభవించే వస్తువుగానే నేటి సమాజం పరిగణిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. డెబ్బై ఏళ్ల స్వాతంత్య్ర దేశంలో మహిళల విషయంలో మౌలిక మార్పులేమీ జరగలేదని నేటికీ వరకట్న హత్యలు జరగడం దారుణమన్నారు. మహిళను ఆటవస్తువుగా చూసే విష సంస్కృతి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు నిచ్చారు.  మహిళా సమస్యల పరిష్కారంలో ప్రగతిశీల మహిళా సంఘం కృషి ఎనలేనిదన్నారు. సమస్యలపై పోరాడుతున్న క్రమంలో అనేక మంది మహిళలు అణచివేతకు గురయ్యారని ఎన్ కౌంటర్  చేయబడ్డారని పేర్కొన్నారు.  సమావేశానికి ముందు పట్టణంలో మహిళలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. జిల్లా నాయకురాలు వై జానకి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గాదే ఝాన్సీ, అందే మంగ ప్రముఖ సామాజిక కార్యకర్త అంబికా, అరుణోదయ  రాష్ట్ర కార్యదర్శి  నాగన్న, న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు ఆవునూరి మధు, జిల్లా కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్, పౌరహక్కుల సంఘం జిల్లా కార్యదర్శి పి విప్లవకుమార్ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి కోలా లక్ష్మీనారాయణ, వైరా సబ్ డివిజన్ కార్యదర్శి షేక్ ఖాసీం తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area