సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెర

Published: Wednesday April 28, 2021
కోవిడ్ ఉన్నా వాడి వేడిగా అన్నిపార్టీల ప్రచారం.
చాలా చోట్ల తీవ్రమైన పోటీ ఉండే అవకాశం, బలపడ్డ విపక్షాలు, స్వతంత్రులు.
అధికార పార్టీలో ఎక్కువ కొత్త అభ్యర్థులు కావడంతో మంత్రి ప్రచారంపైనే ఆశలు.
సిద్దిపేట(ప్రజాపాలన ప్రతినిధి) : ప్రచారం ముగిసింది, ఇక మిగిలింది ప్రలోభాలు, పంపిణీ పర్వమేనా? అన్నది రాజకీయ విశ్లేషకుల వాదన, ఈసారి పోటీ తీవ్రంగా ఉండడం, అటు అధికార పార్టీలో ఎక్కువ శాతం కొత్త అభ్యర్థులు కావడం భాద్యత మొత్తం మంత్రిపైనే పడడంతో మంత్రి హరీష్ రావు సుడిగాలి పర్యటనలు చేసి అధికార పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. ఇదే సమయంలో విపక్షాలలో కాంగ్రెస్ బలహీనంగానే ఉన్నా బీజేపీ చాలావరకు పుంజుకుంది, ఆ పార్టీ తరపున రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ లాంటి హేమాహేమీలు ప్రచారం చేయడం బీజేపీ దుబ్బాక ఎం ఎల్ ఏ రఘునందన్ రావు ఎన్నికలను దగ్గరుండి పర్యవేక్షించడం ఆ పార్టీ అభ్యర్థులకు విజయంపై ధీమాను పెంచుతున్నాయి. ఇక సందట్లో సడేమియా అన్నట్లు పోటీ చేస్తున్న స్వతంత్రులు కూడా కొన్ని చోట్ల ప్రధాన పార్టీల అభ్యర్థులకు గట్టి పోటీనే ఇస్తున్న వీరి వల్ల కొన్ని పార్టీల ఓట్లకు గండి పడే అవకాశం ఉండడంతో గెలుపు ఎవరిదో చివరివరకు చెప్పడం కష్టతరం అయ్యేందుకు ఈ స్వతంత్రులు దోహద పడే అవకాశం ఉందనుకుంటున్నారు జనం. ఏకపక్షంగా సాగుతుందనుకున్న ఈ ఎన్నికలు మంత్రికి, విపక్షాలకు, స్వతంత్రులకు మధ్య త్రిముఖ పోటీ ఉండేలా ఉందంటున్నారు ప్రజానీకం.