సాగర్ నీళ్ల కోసం రోడ్డెక్కిన రైతులు ఈ ఈ రామకృష్ణను వెంటనే సస్పెండ్ చేయాలని రైతులు డిమాండ్

Published: Friday February 03, 2023
రైతుల కొరకు రోడ్డుపై బైఠాయించిన అఖిలపక్ష నాయకులు
 
 
బోనకల్, ఫిబ్రవరి 2 ప్రజాపాలన ప్రతినిధి: మొక్కజొన్న పంటలను రక్షించాలని కోరుతూ మండల అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో రైతులు రోడ్డుపై గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్ ఎస్ పి ఈ ఈ రామకృష్ణ నిర్లక్ష్యం వలన మండలంలోని మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయని, మంగాపురంకు షెడ్యూల్లో లేకపోయినా సాగర్ నీళ్లను ఈ ఈ రామకృష్ణ నీళ్లను ఆంధ్రకు పంపాలని చెప్పగా రైతులు ఆవేశంతో ఇక్కడ మొక్కజొన్న పంటలు ఎండిపోతుంటే నీళ్లను ఆంధ్రకు ఎలా పంపిస్తారని, రైతులు వెంటనే ఈ ఈ రామకృష్ణను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆళ్లపాడు, నారాయణపురం మైనర్ కాల్వ కింద పండిస్తున్న మొక్కజొన్న పంటకు వార బంది లేకుండా నీళ్లు విడుదల చేయాలని, లేనిచో కొన్ని వందల ఎకరాల మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లుతుందని, రోడ్డుపై అఖిలపక్ష నాయకులు, రైతులు గంటపాటు రాస్తారోకో నిర్వహించడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి రాకపోకలు నిలిచిపోయాయి. ఈ తరుణంలో అక్కడికి పోలీసులు చేరుకొని నాయకులతో రైతులతో మాట్లాడి నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడతామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. అనంతరం మండల కేంద్రంలోని నీటిపారుదల శాఖ కార్యాలయం వద్దకు చేరుకొని డిఇ శ్రీనివాసరావును కార్యాలయం లోపల తాళం వేసి రైతులు నిర్బంధించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మొక్కజొన్న పంటలకు సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని, అధికారులపై ఆగ్రహ వ్యక్తం చేశారు. వెంటనే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆళ్ళపాడు, రావినూతల సర్పంచులు మర్రి తిరుపతిరావు, కొమ్మినేని ఉపేందర్, వైస్ ఎంపీపీ గుగులోత్ రమేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గాలి దుర్గారావు, కలకోట సహకార సంఘం అధ్యక్షులు కర్నాటి రామకోటేశ్వరరావు, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, బీ ఆర్ ఎస్ మండల అధ్యక్షులు చేబ్రోలు మల్లికార్జునరావు, మండల రైతు కన్వీనర్ వేమూరి ప్రసాద్, ఎస్టీ సెల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు భూక్యా భద్రు నాయక్, భూక్యా లాక్యా, కందుల పాపారావు, పారా ప్రసాదు, రావినూతల ఆళ్ళపాడు గ్రామాల రైతులు పాల్గొన్నారు.