ఎం.ఈ.ఓ మరియు ప్రధానోపాధ్యాయుల సస్పెన్షన్ ఎత్తివేయాలి : టీటీయు జిల్లా అధ్యక్షులు నునావత్ రాజు

Published: Friday September 24, 2021
జగిత్యాల, సెప్టెంబర్ 23 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో ఏకీన్ పూర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజగంగారాం, మేడిపల్లి, కోరుట్ల ఎం.ఈ.ఓ గంగుల నరేశం సస్పెన్షన్ లను తీవ్రంగా ఖండిస్తూ ఇట్టి ఉత్తర్వులు వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ టీచర్స్ యూనియన్ టీటీయు జగిత్యాల జిల్లా అధ్యక్షులు నునావత్ రాజు, ప్రధాన కార్యదర్శి వుజగిరి జామున రాణి ఉన్నత అధికారులను కోరారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగినందున గ్రామంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం బాధ్యతగా భావించి గ్రామ విద్యా కమిటీ మరియు తల్లిదండ్రుల కమిటీ నిర్ణయం తీసుకొని వాలంటీర్లను నియమించుకొని పాఠశాలను రక్షించాలని ప్రయత్నిస్తుంటే, రకరకాల రిపోర్ట్స్ రోజువారీగా కావాలని అనవసరమైన భారం మోపుతూ ఒక ఉపాధ్యాయుడు పూర్తిస్థాయిలో ధ్రువీకరణ పత్రాలు తయారు చేయడానికి అవసరమైన ప్రస్తుత కాలంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం ఎలానో అధికారులు ఆలోచించాలి. ఆర్.టి.ఈ చట్టం ప్రకారం తరగతికి ఒక ఉపాధ్యాయుడు నియమించాల్సిన విద్యాశాఖ ఆ పని చెయ్యటంలేదు కాబట్టి ఈ క్లిష్టమైన పరిస్థితిలో గ్రామస్థులే తరగతికి ఒక ఉపాధ్యాయున్ని నియమించుకున్న గ్రామస్తులను అభినందించక పోగా అధికారులు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవడం చాలా బాధాకరం. ఈ చర్యలు పై అధికారులు ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసే విధంగా ఉన్నాయని, ప్రైవేట్ పాఠశాలలకు ప్రోత్సాహం అందించే విధంగా ఉన్నాయని టిటియు జిల్లా శాఖ భావిస్తోంది. ఆర్టీఐ చట్టం ప్రకారం తరగతికి ఒక ఉపాధ్యాయున్ని ఇవ్వాల్సిన విద్యాశాఖ గ్రామస్తులు ఆ బాధ్యత తీసుకుంటే ఉపాధ్యాయులను మండల విద్యాధికారిని సస్పెండ్ చేయడం తీవ్రంగా బాధిస్తున్న అంశం. ప్రధానోపాధ్యాయుడు మరియు మండల విద్యాధికారి పై తీసుకున్న చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ టీచర్స్ యూనియన్  టి.టి.యు జగిత్యాల జిల్లా శాఖ డిమాండ్ చేస్తుంది.