చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని వెంటనే రద్దు చేయాలి -- జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్

Published: Wednesday October 26, 2022

జగిత్యాల, అక్టోబర్, 25 ( ప్రజాపాలన ప్రతినిధి): చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని రద్దు చేయాలని చేనేత కార్మికులు మరియు జగిత్యాల జిల్లా ప్రజల పక్షాన ప్రధాని మోడీకి పోస్ట్ కార్డ్ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ దావ వసంత రాశారు. చేనేత కార్మికుల సమస్యలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకొచ్చేందుకు లక్షలాదిగా ఉత్తరాలు రాయాలని మంత్రి కేటీఆర్ మరియు కల్వకుంట్ల కవితక్క ఇచ్చిన పిలుపు మేరకు నేడు జగిత్యాల జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్  ప్రధాని నరేంద్ర మోడీకి ఒక పోస్ట్ కార్డుని రాశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ  చేనేత వస్త్రాలు, చేనేత ఉత్పత్తులపై ఉన్న ఐదు శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని, చేనేత కార్మికులకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి, ఇప్పుడు దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా చేనేత ఉత్పత్తులపై పన్ను వేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో యావత్ భారత జాతిని ఏకతాటిపై నడిపించిన చేనేత వస్త్రాలపైన పన్ను వేసిన తొలి ప్రధాని మోడీనేనని విమర్శించారు. దేశంలొ రెండో అతిపెద్ద రంగమైన చేనేతపై వెంటనే పన్నును రద్దు చెయ్యాలని పోస్ట్ కార్డులో తెలిపారు..