నాణ్యత లేని విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు: ఖమ్మం రూరల్ ఏసీపీ..

Published: Wednesday June 09, 2021
పాలేరు జూన్ 8 ( ప్రజాపాలన ప్రతినిధి) : ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలోని వివిధ సాపుల్లో విత్తన దుకాణాల డీలర్లు నాణ్యత లేని విత్తనాలను రైతులకు అంటగడితే తీవ్రమైన కేసులు నమోదు చేస్తామని ఖమ్మం రూరల్ ఏసీపీ సామ వెంకటరెడ్డి, తెలిపారు. మంగళవారం రూరల్ పరిధిలోని అరెంపుల్ల గ్రామంలోని శ్రీ లక్ష్మి బాలజీ సీడ్ షాపు, తీర్ధాల లోని శ్రీ పార్వతీ ట్రేడర్స్ లో అరెకోడు గ్రామంలోని  శ్రీ రామా షాపులో వ్యవసాయ శాఖ అధికారి వి.నాగేశ్వరరావు తో కలసి ఖమ్మం రూరల్ సిఐ సత్యనారాయణ రెడ్డి తనిఖీ చేసి లైసెన్సు, నిల్వలు, క్రయవిక్రయాల రికార్డులు పరిశీలించారు. నకిలీ విత్తనాల వల్ల ఏ రైతు కుటుంబం ఇబ్బంది పడకూడదన్న ప్రభుత్వ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ ఆదేశాల మేరకు నకిలీ విత్తనాల విక్రయాలను ఉక్కుపాదంతో అణచివేయాలన్న కృతనిశ్చయంతో  ప్రత్యేక నిఘా పెట్టి వ్యూహాత్మకంగా దాడులు నిర్వహిస్తున్నామని రూరల్ ఏసీపీ తెలిపారు. విత్తన డీలర్లు అధికలాభాలకు ఆశపడి ప్రభుత్వ ఆమోదం లేని నాసిరకం విత్తనాలను రైతులకు విక్రయిస్తే వ్యవసాయ శాఖ అధికారులు లైసెన్స్‌ రద్దు చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామన్నారు. దుకాణాలలో రైతులు కొనుగోలు చేసే విత్తనాలకు ఎరువులకు, పురుగు  మందులకు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని సూచించారు నకిలీ విత్తనాలపై మీ వద్ద ఎలాంటి సమాచారం ఉన్నా డయల్‌ 100 లేదా సమీప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. అధికధరలు, నకిలీ విత్తనాలపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని, ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.