పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకోవడమే లక్ష్యం

Published: Wednesday June 09, 2021
- వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ జూన్ 08 ప్రజాపాలన బ్యూరో : పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం ధారూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో లబ్ధిదారులకు రూ.1,09,12,644 (ఒక్క కోటి తొమ్మిది లక్షల పన్నెండు వేల ఆరువందల నలభై నాలుగు) విలువ గల 109 కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... నిరుపేద ఆడ బిడ్డల తల్లిదండ్రులకు ఆర్థిక ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మీ / షాధి ముబారక్ పథకంతో అండగా నిలుస్తుందన్నారు. ఆడపిల్ల తల్లిదండ్రులకు ఈ పథకం ఒక వరంగా మారిందని పేర్కొన్నారు. కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా సంక్షేమ పథకాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ అర్హులైన వారికి అందజేస్తుందని అన్నారు. కంది విత్తనాలను పంపిణీ : ధారూర్ మండల కేంద్రంలోని  ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రైతులకు పిఆర్ జి-
176 కంది రకం విత్తనాలు పంపిణీ చేశామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. వచ్చే వాన కాలంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. విపత్కర సమయంలోనూ పెట్టుబడి సాయం (రైతు బంధు) పథకం ఈ నెల 15 నుండి రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తుంది అన్నారు. రైతుల మేలు కోసం తీసుకునే నిర్ణయాలలో మన రాష్ట్రం దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు రైతులు తప్పని సరిగా లైసెన్స్ పొందిన దుకాణాల నుండి నాణ్యమైన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేసీ, రశీదు తీసుకోవాలన్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న డీలర్ల పై ప్రభుత్వం పీడీ యాక్ట్ చట్టం క్రింద కేసులు నమోదు చేస్తుందన్నారు. రైతులు తప్పనిసరిగా సంబంధిత వ్యవసాయ అధికారులు సూచించిన మెలకువలను పాటించాలన్నారు. రైతుల శిక్షణ కోసం ప్రతి క్లస్టర్ వారీగా రైతు వేదికలను నిర్మించి ప్రభుత్వం రైతులను సంఘటితం చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయ లక్ష్మి, జెడ్పీటీసీ సుజాత, ఏఎంసి చైర్మన్ రాములు, పిఏసిఎస్ సత్యనారాయణ రెడ్డి, వైస్ ఎంపీపీ విజయ్ కుమార్, ఏఎంసి వైస్ చైర్మన్ రాజు గుప్త, సర్పంచుల సంఘం అధ్యక్షులు వీరేశం, మండల పార్టీ అధ్యక్షులు వేణు గోపాల్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ యూనూస్, పిఏసిఎస్ మాజీ చైర్మన్ హన్మంత్ రెడ్డి, ఎంఆర్ఒ భీమయ్య, ఏడిఏ వినోద్ కుమార్, ఎంఏఓ జ్యోతి, ఏఈఓ సంజు రాథోడ్ సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.