వైద్యం వికటించి పసివాడు మృతి

Published: Tuesday March 14, 2023
* అఖిల భారత గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాఘవన్ నాయక్
వికారాబాద్ బ్యూరో 13 మార్చి ప్రజాపాలన : మహావీర్ ఆస్పత్రిలో వైద్యం వికటించి పసివాడు మృతి చెందిన సంఘటన పై పూర్తి విచారణ జరిపి ఆసుపత్రి యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అఖిల భారత గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాఘవన్ నాయక్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా వైద్య కార్యాలయంలో జిల్లా వైద్యాధికారి పాల్వన్ కుమార్ కు పసివాని మృతికి కారకులైన వైద్యుడు మహావీర్ ఆసుపత్రి యాజమాన్యం పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం పరిధిలోగల ఎబ్బనూరు గ్రామ నివాసి ముద్ద వీరేంద్ర ప్రసాద్ కల్పన దంపతులకు మహావీర్ ఆసుపత్రిలో ఆపరేషన్ ద్వారా మగ పిల్లవాడు జన్మించాడు. పుట్టిన మగ పిల్లవాడు 3.5 కిలో గ్రాముల బరువుతో ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు ప్రకటించారని స్పష్టం చేశారు. పుట్టిన పసివానికి ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించకుండా మూడు రోజులపాటు నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. పసివాడు పుట్టిన మూడు రోజుల వరకు ఉమ్మనీరు తాగి పసివాడు మృతి చెందాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహావీర్ ఆసుపత్రిలో పుట్టిన పసివానికి ఎలాంటి వైద్య చికిత్స చేయకున్నా చేసినట్టుగా వైద్యులు చెబుతుండడం విడ్డూరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యునిగా పనిచేస్తున్న డాక్టర్ సందీప్ తో కేస్ షీట్ రాయించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఏఐఎంఎస్ నిబంధనల ప్రకారం మహావీర్ ఆసుపత్రి యాజమాన్యం తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నదని ధ్వజమెత్తారు. జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదు చేసిన వారిలో ధారూర్ వైస్ ఎంపీపీ విజయ్ కుమార్ మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రమేష్ నాయక్ రాజు నాయక్ రాములు నాయక్ మృతి చెందిన ప్రతివాని తల్లిదండ్రులు ముద్ద వీరేంద్ర ప్రసాద్ కల్పన ఉన్నారు.