దొడ్డిదారిలో దొంగ పాస్ బుక్ లు అధికారుల మాయాజాలంతో అదనపు భూమి

Published: Monday June 13, 2022
 కల్లూరు, జూన్ 12 (ప్రజాపాలన న్యూస్):
 
 రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నది సామెత, అధికారులు తలుచుకుంటే ఏమైనా చేయగలరనేది ప్రస్తుత ట్రెండ్. ఉన్నది ఉన్నట్టు చూపించగలరు, లేనిది ఉన్నట్లు  చూపించగలరు.తమ్మిని మమ్మిని చేయడంలో రెవెన్యూ అధికారులది ప్రత్యేక పంథా. మండలంలో తలెత్తిన సమస్యలు చూస్తే వారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదంటున్నారు ప్రజలు .సాదాబైనామా సమయంలో రెవెన్యూ అధికారులు కాసులకు కక్కుర్తిపడి చేసిన చేతివాటం ఎంతోమంది అమాయక రైతులను అవస్థల పాలు చేసింది. అదే సమయంలో ఉన్నతమైన వారికి దొడ్డిదారిలో దొంగ పాస్బుక్కులు ఇప్పించి,రికార్డ్  పరమైన భూములను పాస్ బుక్ ల రూపంలో అప్పగించడం జరిగింది .వాస్తవానికి క్షేత్రస్థాయిలో అక్కడ భూమే లేదు కొందరి కక్కుర్తి కి ఉన్నట్లు సృష్టించిన అధికారమాంత్రికులు.ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో కొర్లగూడెం రెవెన్యూ గ్రామపంచాయతీలో జరిగిన సంఘటనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వివరాల్లోకి వెళితే కొర్లగూడెం రెవెన్యూ గ్రామ పంచాయతీ లో 422/ఈ సర్వే నెంబర్లలో 4 .39 కుంటల విస్తీర్ణం కలదు. అట్టి భూమి 1990-91 సంవత్సరంలో చాట్ల పిచ్చయ్య పట్టాదారుగా, అనుభవదారుగా ఉండటం జరిగింది.క్రయ విక్రయ క్రమంలో ఆ భూమిని బైరెడ్డి కమలమ్మ కొనుగోలు చేయడం జరిగినది(1996- 97). కాలక్రమేణా చాట్ల పెద్ద నరసయ్య 422/ఈ ఉన్న 4.39 కుంటల భూమిని కొనుగోలు చేసి స్వాధీన పరచుకుని ఉన్నాడు.తన కుటుంబ అవసరాల నిమిత్తం కొంత భూమిని తన తమ్ముళ్లకు విక్రయించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూముల క్రమబద్ధీకరణకు సాదాబైనామా అవకాశం కల్పించడంతో, 422/ఈ సర్వేనెంబర్ లో ఉన్న 04.39 కుంటల్లో  చాట్ల పెద్ద వెంకటేశ్వర్లు 1. 10, సీతారాములు0. 05,చాట్ల చిన్న నరసయ్య 30 కుంటలు, కంచపోగు రాధ 30 కుంటలు పోగా, 2.04 కుంటలు తన కుమారుల పేరుతో పాస్ బుక్ లు తీసుకోవటం జరిగింది. అదే గ్రామానికి చెందిన మోదుగు లీల చాట్ల పెద్ద వెంకటేశ్వర్లు దగ్గర0.12 కుంటలు , కంచపోగు రాధ దగ్గర 0. 30 కుంటలు కొనుగోలు చేసి ఎకరం రెండు కుంటల కు 2011 నుండి 422/ ఈ/2/అ పట్టాదారు గా పాస్ బుక్ పొందటం జరిగింది.అదే గ్రామంలో కొందరు ఆక్రమముగా భూమి లేకుండా తమ పేరు మీద తప్పుడు రికార్డు సృష్టించి పాస్ బుక్ లు ఏర్పాటు చేశారు.దీంతో చాట్ల చిన్న నరసయ్య 30 కుంటలకు 25 కుంటలకే పాస్బుక్ లు వచ్చి 5 కుంటలు RSR లోకి పోయింది.తన మనవరాలు పెళ్ళికి భూమి అమ్మాలను చూస్తే కుదరడం లేదని ఇలా నిజమైన రైతులకు అన్యాయం జరిగిందని వాపోతున్నారు.ఈ ఆగడాలను,దందాలను అరికట్టెందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ అక్రమాలకు పాల్పడకండ ఉండటం కోసం తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం  తీసుకొచ్చిన ధరణిపోర్టర్ ను కూడా మోసం చేయడంలో సిద్ధహస్తులని ఈ ఘటన చూస్తే తెలిసిపోయింది. ప్రభుత్వం రైతుల క్షేమం కోసం కల్పించిన అవకాశం రెవెన్యూ అధికారులు చేతివాటం వరంగా మారింది. తమ లీలలతో ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఎవరు డబ్బులు ఇస్తే వారికి బై నెంబర్లతో పాస్బుక్కులు ఇవ్వడం పరిపాటిగా మారింది.దాదాపు 422/ఈ సర్వే నెంబర్ లో నిజమైన రైతులు కాక అదనంగా ఆరుగురు రైతులకు పాస్బుక్కులు మంజూరు చేయించారన్న విషయం బయట పడింది.ఈ క్రమంలోనే మోదుగుల లీల 2019 -20 సంవత్సరం లో 422/ఈ/5 సర్వేనెంబర్ లో 1.02 కుంటల భూమి లేకుండా అదనంగా పాస్బుక్ పొందారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వ్యవసాయ సహాయం నిమిత్తం ఇస్తున్న రైతు బంధు అక్రమంగా పొందటం జరుగుతుంది.సుమారు రెండు సంవత్సరాల తరువాత తెలివిగా ఇదే నెంబర్ తో తాను ఆక్రమముగా పొందిన లేని భూమిని తన భర్త మోదుగు లక్ష్మయ్య పేరు పై రెవెన్యూ అధికారుల సహాయంతో భర్తకు బదలాయించడం  జరిగింది. 2020 నుండి అతను కూడా రైతుబంధు పొందడం జరుగుతుంది. విచిత్రం ఏమిటంటే ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే, ప్రభుత్వ ఉద్యోగులై ఉండి లేని భూమిని రెవెన్యూ అధికారుల సహాయంతో దొంగ పాస్బుక్కులు తీసుకోవడమే కాకుండా ప్రభుత్వ ధనాన్ని రైతుబంధు రూపంలో దోచుకోవడం దురదృష్టకరమని  అని ప్రజలు అంటున్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడే రెవెన్యూ అధికారులకు దొడ్డిదారిలో దోచుకోవాలని చూచే అలాంటి ప్రభుత్వ ఉద్యోగులపై చట్టపరమైన చర్యలు తీసుకొని, అక్రమాలకు పాల్పడ్డ వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.అక్రమంగా పొందిన దొంగ పాస్ బుక్ లను రద్దు చేయాలని కోరుతూ నిజమైన రైతులను,ప్రభుత్వం ను మోసం చేసిన వారిపై తక్షణమే ఉన్నత అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి అక్రమార్కులపై చట్టపరమైన, కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.