నూతన ఓటరు జాబితాను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జి. రవి

Published: Wednesday December 01, 2021

కోరుట్ల, నవంబర్ 29 (ప్రజాపాలన ప్రతినిధి) : ఎలక్షన్ కమీషన్ ఆదేశాల మేరకు నవంబర్ 1 నుండి 30 వ తేది వరకు జిల్లాలో స్పెషల్ సమ్మరి రివిజన్ కార్యక్రమాన్ని చేపట్టగా, సోమవారం రాయికల్ మండలం లోని మైతాపూర్ గ్రామంతో పాటు కోరుట్ల మండలం జోగిన్ పల్లి, గుమ్లాపూర్ గ్రామాలలో నూతన ఓటరు జాబితాలో చేపట్టిన సవరణలు పరిశీలించి, పాఠశాలలను జిల్లా కలెక్టర్ జి.రవి ఆకస్మీకంగా తనిఖీ చేశారు.మొదటగా ఓటరు జాబితాలో నూతనంగా చేర్చబడిన వారి ఇంటి వద్దకు స్వయంగా వెళ్లిన కలెక్టర్ వారి స్టడి, బర్త్, ఇతర దృవీకరణలను స్వయంగా పరిశీలించారు. అనంతరం బి.ఎల్.ఓ.ల ద్వారా నూతనంగా ఓటరు జాబితాలో చేర్చబడిన, చనిపోయిన మరియు చిరునామ, ఇతర సవరణలను పరిశీలించి, ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేని, తుది ఓటరు జాబితాను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం బిఎల్ఓల ద్వారా జాబితాలో మార్పులపై వారి కార్యచరణనను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొరుట్ల మండలంలోని జోగన్ పల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల, గుమ్లాపూర్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలతో పాటు అంగన్ వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. 10వ తరగతి గదికి వెల్లి ఇంగ్లీష్, బయాలజీ సబ్టేక్టుల నుండి విద్యార్థుల ద్వారా పాఠాలను చదివించడంతో పాటు పలు ప్రశ్నలను అడిగారు. విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందించాలని ప్రిన్సిపాల్కు సూచించారు. అనంతరం అంగన్వాడీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల వివరాలు, హాజరు వివరాలు అడిగి తెలుసుకొని విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఈ పర్యటనలో కోరుట్ల ఆర్డిఓ టి. వినోద్ కుమార్, రాయికల్ తహసీల్దార్ మహేశ్వర్, కోరుట్ల తహసీల్దార్ సత్యనారాయణ, ఇతర సిబ్బంది పాల్గోన్నారు.