ప్రజావాణి సమస్యలను వెంటనే పరిష్కరించాలి

Published: Tuesday April 26, 2022
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో 25 ఏప్రిల్ ప్రజాపాలన :  ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని  జిల్లా కలెక్టర్  నిఖిల సంబంధిత తహసీల్దార్లను ఆదేశించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల స్వీకరణలో భాగంగా ఈరోజు అర్జీ దారుల నుండి వివిధ సమస్యలపై 122 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశపు హాలులో నిర్వహించిన  ప్రజావాణిలో భాగంగా వివిధ మండలాల నుండి వచ్చిన అర్జీదారుల సమస్యలను వింటూ తక్షణమే పరిష్కరిం చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, అన్ని మండలాల్లో ప్రతి వారం రైతు సదస్సులు నిర్వహించి సమస్యలను పరిష్కరించడం వలన ప్రజలు జిల్లా స్థాయిలో కార్యాలయాల చుట్టు తిరగడం తగ్గిందన్నారు.  చిన్న చిన్న భూ సమస్యలు మండల స్థాయిలో తహసీల్దార్లు అక్కడికి అక్కడే పరిష్కరిస్తే ప్రజలు ఇబ్బంది పడరని తెలిపారు. భూ సమస్యల పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం కొసం రెవిన్యూ డివిజన్ స్థాయిలో మరియు మండల స్థాయిలో రెవిన్యూ సదస్సులు నిర్వహించి 50 వేలుగా ఉన్న పెండింగ్ దరఖాస్తులను 2 వేలకు తగ్గించడం జరిగిందన్నారు.  పద్దతి ప్రకారంగా ఆర్ఐ నుండి తహసీల్దార్, ఆర్డిఓ స్థాయి నుండి కలెక్టర్ కు దరఖాస్తులు పంపినట్లయితే సమస్యలు పరిష్కరించుటకు వీలు పడుతుందన్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి సాయంత్రం వరకు పరిష్కారం కొసం కలెక్టర్ కు పంపాలన్నారు. కొన్ని భూ సమస్యల పరిష్కారానికి ధరణిలో ఆప్షన్స్ రాలేదని, వచ్చిన వెంటనే పరిష్కరిస్తామన్నారు. మండల కార్యాలయాలలో కంప్యూటర్ ఆపరేటర్లు అవకతవకలకు పాల్పడుతున్నట్లు దృష్టికి వచ్చిందని, ఇక ముందు ఇలా జరుగకుండా తహసీల్దార్లు జాగ్రత్తలు వహించాలన్నారు. రెవిన్యూ సదస్సుల వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్, తాండూర్ రెవిన్యూ డివిజనల్ అధికారులు విజయకుమారి, అశోక్ కుమార్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి రాంరెడ్డి, ఏఓ హరిత అన్ని మండలాల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. వచ్చిన దరఖాస్తులను వెనువెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ప్రజా ఫిర్యాదుల విభాగాన్ని అర్జీదారులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రజాఫిర్యాదులలో అదనపు కలెక్టర్ లు పి.రాంబాబు, హేమంత్ బోర్కడే, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.