ఆదివాసీ, బంజారా భవనాల ప్రారంభోత్సవానికి ఆదివాసీ, గిరిజనులు లక్షలాదిగా తరలిరావాలి

Published: Monday September 12, 2022

పాలేరు సెప్టెంబర్ 11 ప్రజాపాలన ప్రతినిధి
ఈనెల 17వ తేదిన బంజారాహిల్స్, హైదరాబాద్ నందు ఆదివాసీ, బంజారా ఆత్మగౌరవ భవనాలను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారి చేతులమీదుగా ప్రారంభించుకోబోతున్న సందర్భంగా ఆదివాసీ, గిరిజనులు లక్షలాదిగా తరలిరావాలని తెలంగాణ ఉద్యమకారుడు, తెరాస జిల్లా సీనియర్ నాయకులు బాదావత్ లక్ష్మణ్ నాయక్ పిలుపునిచ్చారు. సభ ఏర్పాట్ల కార్యక్రమాల నిర్వహణపై గిరిజన శాఖ మాత్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన బంజార, ఆదివాసి సంఘాల నాయకులు, ట్రై కార్, జిసిసి ఛైర్మన్ లు, విద్యార్ధి, ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశంలో పాల్గొన్న లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గిరిజనుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా అత్యంత విలువైన బంజారాహిల్స్ లో బంజారా, ఆదివాసి ఆత్మగౌరవ భవనాలను నిర్మించడం జరిగిందని తెలిపారు. గిరిజన ఆదివాసీల అభివృద్ధే లక్ష్యంగా వారి అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని పునరుద్ఘాటించారు. గిరిజనుల పోడు భూముల సమస్య త్వరలోనే తీరుతుందని, గిరిజన రిజర్వేషన్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్రంతో పోరాడి తప్పకుండా సాధిస్తారని ఆకాంక్షించారు. బంజారా, ఆదివాసి ఆత్మగౌరవ భవనాలు నిర్మించి మనల్ని గౌరవించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రుణపడి ఉండాలని, 17వ తేదీన జరగబోయే సభను యావత్ తెలంగాణ గిరిజన జాతి కలిసివచ్చి విజయవంతం చేయాలని లక్ష్మణ్ నాయక్ పిలుపునిచ్చారు.