కమ్యూనిస్టుల వల్లనే భారతదేశంలో తెలంగాణ విలీనం సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర

Published: Monday September 12, 2022
బోనకల్, సెప్టెంబర్ 11 ప్రజా పాలన ప్రతినిధి: భారతదేశంలో తెలంగాణ ప్రాంతం విలీనం కావటానికి కమ్యూనిస్టుల తోనే సాధ్యం అయిందని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఆళ్ళపాడు గ్రామంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవ వారోత్సవాలను సాయుధ పోరాట యోధుడు అమరజీవి బుంగా వీరయ్య స్తూపం వద్ద నుండి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ భారతదేశంలో విలీనం అయింది అంటే దానికి కారణం కేవలం కమ్యూనిస్టులు మాత్రమే అన్నారు. ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించుకున్న తర్వాత రావి నారాయణరెడ్డి, మహమ్మద్ ముగ్దం మోహినుద్దీన్, బద్దం ఎల్లారెడ్డి ల నాయకత్వంలోని కమ్యూనిస్టులు సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారన్నారు. నాడు తెలంగాణలో ఉన్న అరాచక పాలన కు వ్యతిరేకంగా, నిరంకుశత్వానికి, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా జరిగిన మహత్తర పోరాటమే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అని ఆయన కొనియాడారు. పదివేల గ్రామాలలో విముక్తి చెంది ఉండటం తో పాటు అణగారిన వర్గాలకు పది లక్షల ఎకరాలను పంపిణీ చేసిన ఘనత కమ్యూనిస్టు పార్టీకే ఉందన్నారు. మండలంలోని చిరునోముల గ్రామానికి చెందిన రావెళ్ళ జానకిరామయ్య ఈ ప్రాంతానికి తొలి కమ్యూనిస్టు నాయకుడని కొనియాడారు. ఆయనతోపాటు రాయన పేట గ్రామానికి చెందిన పారుపల్లి రామకోటయ్య, బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన గాదె మాధవరెడ్డి, లక్ష్మీపురం గ్రామానికి చెందిన మల్లెల వెంకటేశ్వర్లు, సీతానగరం గ్రామానికి చెందిన తాళ్లూరి భద్రయ్య, గోవిందా పురం గ్రామానికి చెందిన జొన్నలగడ్డ రామయ్య, తమ్మరపు గోవిందు తదితరులు దళం గా చేరి ఈ ప్రాంతంలో రజాకార్ల ఆగడాలను హరికట్టారన్నారు. ఈ మహత్తర పోరాట చరిత్రను వక్రీకరిస్తున్నారని, ఇది మతపరమైన టువంటి పోరాటంగా చిత్రీకరించడానికి బిజెపి కుట్రలు పన్నుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పాఠ్య పుస్తకాల్లో ఈ చరిత్రను ప్రచురిస్తే రాబోయే తరాలకు చరిత్ర అర్థమవుతుందని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోట రామాంజనేయులు, బెజవాడ రవిబాబు, జిల్లా సమితి సభ్యులు తూము రోషన్ కుమార్,సీనియర్ నాయకులు జక్కా నాగభూషణం,బోనకల్ మండల కార్యదర్శి యంగల ఆనందరావు, ఆళ్ళపాడు గ్రామ శాఖ కార్యదర్శి బెజవాడ నరేష్, మండల నాయకులు బుంగా గోపి, బుంగా తిరపయ్య, బుంగా గోపి, తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area