7వ విడత హరిత హారాన్ని విజయవంతం చేయాలి : విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Published: Tuesday June 22, 2021
వికారాబాద్, జూన్ 21, ప్రజాపాలన బ్యూరో : 10 శాతం గ్రీన్ బడ్జెట్ ఏర్పాటు చేసి హరిత తెలంగాణగా మార్చటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్ పర్యటనకు వచ్చిన విద్యా శాఖ మంత్రి హరితహారంపై వికారాబాద్ కలెక్టర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ..6 విడతల్లో తెలంగాణలో 210 కోట్ల మొక్కలు నాటడం జరిగిందని గుర్తు చేశారు. 7 వ విడత లో 19.86 కోట్ల మొక్కలు నాటే లక్ష్యం ఉందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మానస పుత్రిక హరితహారాన్ని విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. పల్లె, పట్టణ ప్రగతిని ఛాలెంజింగ్ గా తీసుకొని పనులు జరుగాలని సూచించారు. ప్రతి నెల 308 కోట్లు పల్లె ప్రగతి 150 కోట్లు పట్టణ ప్రగతికి నేరుగా గ్రామాలు, పట్టణాలకు నిధులు వస్తున్నాయని వివరించారు. వికారాబాద్ జిల్లాలో పల్లె ప్రకృతి వనానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసలు పనితనానికి నిదర్శనమని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 40 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యాన్ని పూర్తి చేయాలని చెప్పారు. వికారాబాద్ జిల్లాగా ఏర్పడిన నాటి నుండి 3 కోట్ల పై చిలుకు మొక్కలు నాటడం జరిగిందని విశ్లేషించారు. హరిత తెలంగాణా కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని హితవు పలికారు. మరి కొన్ని రోజుల్లో జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఉండటంతో పల్లె ప్రగతి,పట్టణ ప్రగతి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రత్యేక అధికారులు గ్రామాల సరిహద్దుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయించి, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అన్నారు. గ్రామ స్థాయిలో వార్డు సభ్యుల నుండి సర్పంచ్, ఎంపీటీసీ లు, జడ్పీటీసీ ల వరకు, మునిసిపాలిటీ లలో కౌన్సిలర్ల నుండి చైర్మన్ ల వరకు అందరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. మునిసిపాలిటీలలో ప్రతి వార్డులో చిన్న పార్క్ ఉండేలా, ఒక నర్సరీ కోసం కృషి చేసి ప్రతి ఇంటికి 6 మొక్కలు నాటేటట్లు కృషి చేయాలన్నారు. పచ్చదనం పై దృష్టి పెట్టని వారిపై చర్యలు, మునిసిపల్ చట్టం లొనే నిబంధనలు ఉన్నాయని గుర్తు చేశారు. పల్లె ప్రకృతి వనాలు వారంలో పూర్తి చేయాలని తెలిపారు. జిల్లాలో ని 18 మండలాల్లో 5 నుండి 10 ఎకరాల్లో మండల ప్రకృతి వనాలకు స్థలాలు గుర్తించేందుకు ఎంపీపీ, జడ్పీటీసీ లు అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. నియోజకవర్గనికి ఒక నర్సరీ ఏర్పాటు చేయడానికి శాసన సభ్యులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ దామల వద్ద అవసరం మేరకు బోర్లు వేయాలని వివరించారు. రైతు వేదికలు, డంపింగ్ యార్డులు, వైకుంఠ ధామాల వద్ద గ్రీన్ ఫెన్సింగ్ వేయాలని చెప్పారు. ఓపెన్ స్థలాల్లో మొక్కలు నాటాలన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు గ్రామాల్లోకి వెళ్ళినపుడు పాఠశాలలను కూడా సందర్శించాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకస్మికంగా గ్రామాల పర్యటనకు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. అన్ని గ్రామాల్లో పల్లె ప్రగతి పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు. శాసన సభ్యులు గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని చెప్పారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో 24 శాతం ఉన్న పనులు 33 శాతానికి పెరిగడం విశేషమని కొనియాడారు. మానవ మనుగడకు చెట్లే ఆధారమని అన్నారు. ప్రతి ఒక్కరూ ఒక్క మొక్క నాటి భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన గాలిని అందిద్దామని హితోక్తి పలికారు. పాఠశాలలు జులై ఒకటి నుండి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించటంతో అధికారులు అందుకనుగుణంగా పాఠశాలలను సిద్ధం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ సునీత రెడ్డి, కలెక్టర్ పౌసుమి బసు, ఎమ్మెల్సీ సురభి వాణి దేవి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కాలే యాదయ్య, కొప్పుల మహేశ్వర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, రాష్ట్ర విద్యా మౌళిక సదుపాయాల సంస్థ చైర్మన్ నాగేందర్ గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళి కృష్ణ, అడిషనల్ కలెక్టర్ లు మోతిలాల్, చంద్రయ్య, మునిసిపల్ చైర్ పర్సన్ మంజుల, వికారాబాద్ జిల్లాలో ని మండలాల ఎంపీపీ, జడ్పీటీసీ లు, ఎంపిడిఓలు మునిసిపల్ చైర్మన్ లు, కమిషనర్ లు తదితరులు పాల్గొన్నారు.