*బీజేపీ తాటాకు చప్పుళ్లు ఎక్కువయ్యాయి బీజేపీని నిలువరించకుంటే పామై కరుస్తుంది

Published: Thursday July 07, 2022
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు మందడపు రాణి*
మధిర రూరల్ జులై 6 ప్రజా పాలన ప్రతినిధి దేశంలో మతోన్మాద శక్తులను రెచ్చగొట్టి బీజేపీ పబ్బం గడుపుకోవాలని చూస్తోందని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం (ఏ ఐ కె ఎస్)రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు మందడపు రాణి మండిపడ్డారు. రాష్ట్రంలో ఇటీవల బీజేపీ తాటాకు చప్పుళ్లు ఎక్కువయ్యాయని, వాటిని నిలువరించటంలో రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని ఆమె ఆరోపించారు. జూలై 1 నుంచి 3 వ తేదీ వరకు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రెండవ రాష్ట్ర మహాసభల్లో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలిగా ఖమ్మం జిల్లా మాజీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అమరజీవి కామ్రేడ్ మందడపు నాగేశ్వరరావు, సతీమణి మందడపు రాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బుధవారం మధిర సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రజలు ముందుకు రావాలని రాణి పిలుపునిచ్చారు, లేకుంటే అది పామై కరుస్తుందని ఆమె హెచ్చరించారు. దేశంలో రైతుల్ని  బీజేపీ ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో రైతుల సమస్యలపై రైతు సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతంగా నిర్వహిస్తానని ఆమె తెలిపారు. రాష్ట్రంలో నూతన రెవెన్యూ చట్టాల అమలు తరువాత రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ధరణి పోర్టల్‌లో కూడా అనేక లొసుగులు ఉన్నాయని రాణి ఆరోపించారు. దళితులకు మూడెకరాల భూమిని ఇస్తామన్న హామీని టీఅర్‌ఎస్‌ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు.
ప్రజల హక్కులను కాలరాస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలోని టీఅర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని పారదోలేందుకు  ఉద్యమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నూతన అధ్యక్షులుగా ఎన్నికైన భాగం హేమంతరావు, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మ,
రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండపర్తి గోవిందరావు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి దొండపాటి రమేష్ కి ఆమె శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి బెజవాడ రవిబాబు,మచ్చ వెంకటేశ్వర్లు,మచ్చ పద్మ,సుజాత,తదితరులు పాల్గొన్నారు.