తెలుగు రాష్ట్రాలలో పలు సేవాకార్యక్రమాలు నిర్వహించనున్న నార్త్ అమెరికా తెలుగు సొసైటీ : నూతి

Published: Thursday June 09, 2022
హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి ):
 
భాషే రమ్యం సేవే గమ్యం అంటూ ఉత్తర అమెరికా లో తెలుగు వారికి పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న నార్త్ అమెరికా తెలుగు సొసైటీ ( NATS) నూతన  అధ్యక్షుడిగా ఎన్నిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు నూతి బాపయ్య చౌదరి.
 
సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన నాట్స్ ఉపాధ్యక్షుడు ప్రసన్న పిన్నమనేని, రాజేష్ మాదాల తో కలిసి పాల్గొన్నారు.
 
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 
 
 NATS ఆధ్వర్యంలో ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రాబోయే కాలంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విద్య, వైద్య, సాంస్కృతిక, సేవా రంగాలలో NATS ఆధ్వర్యంలో పలు సేవా  కార్యక్రమాలను నిర్వహించబోతున్నట్లు తెలిపారు.
 19 న గుంటూరు జిల్లా పెదనందిపాడులో ఐ క్యాంప్ నిర్వహించబోతున్నట్లు తెలిపారు. అమెరికా లో బాలల సంబరాలు, మహిళా సంబరాలు పేరుతో పలు సాంస్కృతిక, సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు భవిష్యత్తు లో మరిన్ని సేవాకార్యక్రమాలు అమెరికా లో, రెండు తెలుగు రాష్ట్రాలలో వచ్చే రెండేళ్లలో భారీ
కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
 
అమెరికాలో తెలుగువారంతా కలిసి ఆడుకునే వేదికలను ఏర్పాటు చేసి క్రీడా పోటీలు
నిర్వహిస్తోందన్నారు.తెలుగు మహిళల్లో స్పూర్తిని
నింపేలా నాట్స్ ప్రతి ఏటా మహిళ సంబరాలు నిర్వహిస్తోందని,మహిళా సాధికారత కోసం
సదస్సులు నిర్వహిస్తోందన్నారు. మహిళల్లో ఆర్థిక అక్షరాస్యత పెంచేలా అనేక కార్యక్రమాలు
చేపడుతోందని తెలిపారు.
 
అమెరికా తెలుగు సంబరాలు
 
ప్రతి రెండేళ్లకు ఒక్కసారి నాట్స్ అమెరికా తెలుగు సంబరాలను ఘనంగా నిర్వహిస్తుందని. తెలుగు 
రాష్ట్రాల నుంచి అతిరథ మహారథులను, కవులను, కళకారులను, వివిధ రంగాల ప్రముఖులను
ఆహ్వానించి..తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టి పడేలా.. ఈ సంబరాలను నిర్వహిస్తోందని అన్నారు.
వేలాది మంది పాల్గొనే ఈ తెలుగు సంబరాలు ఈ సారి 2023లో న్యూజెర్సీ వేదికగా
జరగనున్నాయని తెలిపారు. అమెరికాలో తెలుగు భాష, సంస్కృతి మన రేపటి తరానికి కూడా వారసత్వంగా
అందించేందుకు అనేక కార్యక్రమాలు రూపొందించి ఆ దిశగా ముందుకు అడుగులు వేస్తోందని పేర్కొన్నారు.