ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి మూడంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు, విచారణ జరిపించి చర్యల

Published: Tuesday December 20, 2022
బెల్లంపల్లి డిసెంబర్ 19 ప్రజా పాలన ప్రతినిధి: బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని పెద్దనపల్లి పదవ వార్డులో రైల్వే మైక్రోస్టేషన్ వద్ద తప్పుడు భూ పత్రాలను చూపిస్తూ ప్రభుత్వ  స్థలాన్ని అక్రమంగా  కబ్జా చేసి మూడు అంతస్థుల భవనాన్ని స్థానికేతరుడైన వ్యక్తి  నిర్మిస్తున్నారని, వెంటనే అధికారులు నిర్మాణాన్ని ఆపి విచారణ జరిపించి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని,  జాతీయ కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ మద్దెల శ్రీనివాస్ స్థానిక ఆర్డిఓకు సోమవారం వినతి పత్రం సమర్పించారు.
అనంతరం ఆయన  విలేకరులతో మాట్లాడుతూ,
 అకేనపల్లి శివారులోని సర్వే నం.6 లోని భూమిని రిజిస్ట్రేషన్ చేసుకొని, ఆ భూమిని పెద్ధనపల్లి శివారు లో చూపిస్తూ, ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్నారని, దీనికి మున్సిపల్ అధికారులు ఏ విధంగా అనుమతి ఇచ్చారో మున్సిపల్ కమిషనర్ తెలపాలని ప్రశ్నించారు.
అక్రమంగా నిర్మిస్తున్న మూడు అంతస్తుల భవన నిర్మాణం పై విచారణ జరిపించాలని
 ఆర్డీఓ కి వినతిపత్రాన్ని సమర్పించామని, ఆర్డీఓ  స్పందించి తప్పకుండా విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు గా ఆయన తెలిపారు. లేనియెడల
ఈ విషయం పై జిల్లా పాలనాధికారి కి  వినతిపత్రాన్ని ఇచ్చి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
 బెల్లంపల్లిలో ఎన్నో భూ కబ్జాలు, అక్రమ నిర్మాణాలు, జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు గుడ్డివాళ్ళుగా వ్యవహరిస్తున్నారని, బెల్లంపల్లి పట్టణంలో జరుగుతున్న  అక్రమాలపై త్వరలో బహిరంగంగా వివరాలన్నీ ఆధారాలతో సహా బయట పెడతానని అన్నారు.
 ఈ కార్యక్రమంలో పట్టణ యూత్ అధ్యక్షులు కొండికొప్పుల పవన్ కుమార్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు క్రాంతి, ప్రధాన కార్యదర్శి అయిడపు ప్రదీప్, తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.