ప్రధాని మోదీ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా పీర్జాదిగూడలో టీఆర్ఎస్ ఆందోళన

Published: Thursday February 10, 2022
మేడిపల్లి, ఫిబ్రవరి 9 (ప్రజాపాలన ప్రతినిధి) : పార్లమెంట్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ ఏర్పాటుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, డిప్యూటి మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, కార్పొరేషన్ తెరాస పార్టీ అద్యక్షుడు దర్గ దయాకర్ రెడ్డి అధ్వర్యంలో కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా రెండు వందల మంది కార్యకర్తలతో నల్ల జెండాలు చేత పట్టుకొని బైక్ ర్యాలి నిర్వహించారు. మోడీ, బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఉప్పల్ డిపో వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మేయర్ జక్క వెంకట్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అరవై ఏండ్ల ఆకాంక్ష అని, ఎందరో అమరుల త్యాగ ఫలితంగా ఏర్పడిన స్వరాష్ట్రం ఏర్పడినప్పటి నుండి నేటివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాలలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రధాని మోడీ బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువజన విభాగం నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.