కాలుష్య నియంత్రన పౌరుడి బాద్యత.

Published: Wednesday December 01, 2021
మంచిర్యాల బ్యూరో, నవం30, ప్రజాపాలన : కాలుష్యాన్ని నియంత్రించాల్సిన బాధ్యత ప్రతీ పౌరుడిపై ఉందని రైట్ టు హెల్త్ ఫోరమ్ రాష్ట్రఅధ్యక్షులు రాజలింగు మోతె అన్నారు. డిసెంబర్ 2న జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం సందర్బంగా అవగాహన కరపత్రాలను మంగళవారం విడుదల చేశారు. అనంతరం రాష్ట్రఅధ్యక్షులు రాజలింగు మోతె మాట్లాడుతూ.. పర్యావరణ కాలుష్యం వల్ల భూగోళంపై జీవకోటి మనుగడ కష్టతరంగా మారిందన్నారు. ప్రపంచీకరణ పేరుతో అభివృద్ధి చెందిన దేశాలు వర్ధమాన దేశాల ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని, విదేశీ కంపెనీలు వర్ధమాన దేశాలలో పరిశ్రమలు స్థాపించి లాభాన్ని పిండుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సరిగ్గా 33 సంవత్సరాల క్రితం 1984 డిసెంబర్ 2న మధ్యప్రదేశ్ లోని భోపాల్ నగరంలో యూనియన్ కార్బైడ్ కెమికల్ ఫ్యాక్టరీ లో నుంచి విషవాయువులు (మిథైల్ ఐసో సైనేట్) లీకయి నగరంలోని వేలాదిమంది ప్రజలను నిమిషాలలో మట్టు బెట్టిందని, ఈ ఘోరకలి మనదేశ మానవాళి గుర్తుంచుకునే విధంగా డిసెంబర్ 2ను కాలుష్య నియంత్రణ దినోత్సవంగా ప్రకటించిందన్నారు. పర్యావరణ పరిరక్షణ, దేశ ప్రజలకు పూర్తి రక్షణతో కూడిన అభివృద్ధి ఉండాలని, దేశంలో ఎన్నో పర్యావరణ చట్టాలు ఉన్నా, వాటిని సమగ్రంగా అమలు చేయడం లేదన్నారు. ముఖ్యంగా పారిశ్రామిక, పర్యావరణచట్టాలను అమలు చేయడంలో ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. కంపెనీల యాజమాన్యాలకు ఆదేశాలు అందిం చాలని, అలా చేసినప్పుడే భూపాల్ లాంటి దుర్ఘటన లు మళ్లీ  పునరావృతం కాకుండా చూసుకోగలమన్నారు. ఈ కార్యక్రమం లో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి గుమ్ముల శ్రీనివాస్, నాయకులు నెన్నెల నర్సయ్య, తోకల మహేష్, కీర్తి రమేష్, కాసార్ల నాగరాజు, తాడబోయినరఘు, రామగిరి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.