ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న ఛాయాచిత్రాలు

Published: Thursday June 09, 2022
మధిర సిఐ మురళి పని విధానాన్ని మెచ్చుకుంటున్న అధికారులు ప్రజలు*
మధిర జూన్ 8 ప్రజా పాలన ప్రతినిధి ప్రజలకు సమాచారం స్పష్టంగా అర్థం కావాలంటే  మాటలు కంటే ఛాయాచిత్రం ద్వారా సులభంగా తొందరగా అర్థం అవుతుంది. దీన్ని గ్రహించిన పోలీస్ శాఖ గతంలోనే కళాజాతను ఏర్పాటు చేసి మూఢ నమ్మకాలను (చేతబడి) నమ్మొద్దని ప్రజల్లో చైతన్యాన్ని తీసుకు వచ్చారు. దీనిని స్ఫూర్తిగా తీసుకున్న మధిర సిఐ వడ్డేపల్లి మురళి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన మధిర పోలీస్ సర్కిల్ కార్యాలయం గోడలపై పోలీస్ శాఖ ప్రజలకు అందించే సేవలతో పాటు చట్టాల గురించి ఏర్పాటు చేసిన ఛాయాచిత్రాలు ప్రజల్లో ఆలోచన రేకెత్తిస్తున్నాయి. ప్రజలకు పోలీస్ శాఖ నిరంతరం రక్షణ కల్పిస్తుంది. ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు ఏం చేయాలి అనే  విషయాన్ని ఛాయాచిత్రం ద్వారా మధిర సిఐ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే ముందుగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసుల త్యాగాలను గుర్తు చేస్తూ ఏర్పాటుచేసిన పోలీస్ అమరవీరుల స్తూపం యొక్క చిత్రపటం ప్రజల్లో ఆసక్తితో కూడిన ఆలోచన కలిగించే విధంగా ఉన్నాయి. అదేవిధంగా ఆపదలో ఉన్నవారు 100కి ఫోన్ చేస్తే తక్షణమే పోలీసులు వచ్చి వారిని కాపాడతారని చెప్పే చిత్రపటం సైతం ఏర్పాటు చేశారు. మహిళలను వేధింపులకు గురిచేస్తే షీ టీమ్ని సంప్రదించాలని చెప్పే చిత్రపటాన్ని, బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం అని చెప్పే చిత్రపటాలను ఏర్పాటు చేసి ప్రజలకు చట్టాల గురించి ఛాయా చిత్రాల ద్వారా వివరించారు. సర్కిల్ కార్యాలయం గోడలపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్రాల గురించి మధిర సిఐ వడ్డేపల్లి మురళిని ఆంధ్రప్రభ కదిలించ గా ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ ఆదేశాల మేరకు వైరా ఏసిపి సాధన రష్మి సూచనల మేరకు చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసమే గోడలపై ఛాయాచిత్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. మధిర సర్కిల్ పరిధిలో ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను పగడ్బందీగా అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు గురించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు.