ప్రమాదమని విన్నవించినా పట్టించుకోని విద్యుత్ సిబ్బంది

Published: Wednesday August 25, 2021
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 25 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మున్సిపల్ లో 20వ వార్డు లో గత వారం రోజుల క్రితం బోయవాడ బస్తి, స్మశాన వాటిక సమీపాన ఉన్న విద్యుత్ స్తంభాన్ని గుర్తుతెలియని ట్రాక్టర్ డీకొట్టగా పూర్తిగా పట్టు కోల్పోయి మొదలు దగ్గర బీటలు వారి ఇప్పుడు వైర్ల సహాయంతో కనిపిస్తుంది. విద్యుత్ స్తంభం విరిగి ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని వార్డు ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. కౌన్సిలర్ సుల్తానా మాక్బుల్ విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ స్తంభం సమీపాన లక్ష్మీ నరసింహ్మ కిరాణం షాప్ కు పదుల సంఖ్యలో ప్రజలు వచ్చి పోతుంటారు. దారివెంట ద్విచక్రవాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లు సైతం వెళుతుంటాయని స్థంభం విరిగి ప్రమాదం జరగక ముందే పాతస్థంభం తొలగించి కొత్తది విద్యుత్ స్థంభం ఏర్పాటు చేయాలని దివిటి మల్లేష్, విజయ్ కుమార్, రిషికేశ్, రూపేష్ తదితరులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా విద్యుత్ అధికారులు మేలుకొని జరగబోయే ప్రమాదాన్ని నివారించాలని వార్డు ప్రజలు కోరుతున్నారు.