వికారాబాద్ మున్సిపల్ కు దక్కిన గౌరవం

Published: Tuesday November 23, 2021
దేశంలో 16వ ర్యాంక్, రాష్ట్రంలో 4వ ర్యాంకు
శానిటైజర్ సిబ్బందికి అంకితమిచ్చిన చైర్ పర్సన్ మంజుల రమేష్
వికారాబాద్ బ్యూరో 22 నవంబర్ ప్రజాపాలన : శానిటైజర్ సిబ్బంది చేసిన కృషికి తగిన ప్రతిఫలం లభించిందని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల రమేష్ కొనియాడారు. సోమవారం చైర్ పర్సన్ అధ్యక్షతన వికారాబాద్ మున్సిపల్ కౌన్సిల్ హాల్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డుల్లో భాగంగా వికారాబాద్ మున్సిపాలిటీకి మరో అరుదైన గౌరవం దక్కిందన్నారు. 2021 స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా వికారాబాద్ మున్సిపాలిటీ గత ఏడాది కంటే ఈ ఏడాది మెరుగైన ర్యాంక్ సాధించి సౌత్ ఇండియాలో 16వ ర్యాంక్, తెలంగాణలో 4వ ర్యాంక్ కు ఎగబాకిందని పేర్కొన్నారు. వికారాబాద్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న శానిటేషన్ (పారిశుద్ధ్య) కార్మికుల సేవలు మరువలేనివని, వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాని చెప్పారు. తెలంగాణ నూతన రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక కృషి, మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత మున్సిపాలిటీలలో అనేక మార్పులు తీసుకొచ్చి ప్రతి మున్సిపల్ ను పారిశుద్ధ్యం, అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారు. వీరితోపాటు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి సహకారం, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సూచనలు,సలహాలతో వికారాబాద్ మున్సిపల్ ను పారిశుధ్యం, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నాం అన్నారు. గత ఏడాది సౌత్ ఇండియా జోన్ లో 67వ ర్యాంకు సాధించిన వికారాబాద్ మున్సిపల్ ఈసారి ఏకంగా 16వ ర్యాంకుకు ఎగబాకింది. అలాగే తెలంగాణలో 7వ ర్యాంక్ లో ఉన్న మనం 4వ ర్యాంక్ కు ఎగబాకడంలో సహకరించిన 34 మంది కౌన్సిలర్లకు, మున్సిపల్ సిబ్బందికి, శానిటేషన్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఏడాది స్వచ్ఛ సర్వేక్షన్ లో ఇంత మెరుగైన ర్యాంక్ సాధించడానికి సహకరించిన వికారాబాద్ మున్సిపల్ ప్రజల అందరికీ మున్సిపల్ ఛైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మంజుల రమేష్, కౌన్సిల్ సభ్యులు అందరూ కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ శంషాద్ బేగం, కౌన్సిలర్లు, మహిళా కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.