ట్రస్మా ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు సన్మానం.

Published: Tuesday September 06, 2022
మంచిర్యాల బ్యూరో, సెప్టెంబర్ 05, ప్రజాపాలన:
 
మంచిర్యాల జిల్లా కేంద్రం లోని  కార్మల్ కాన్వెంట్ హై స్కూల్ లో ట్రస్మా జిల్లా సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల నుండి ఒక్క టీచర్ చొప్పున విశిష్ట సేవలు అందిస్తున్న  150 మంది  ఉపాధ్యాయులను  శాలువాతో సత్కరించి జ్ఞాపికలు అందజేసి వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్. వెంకటేశ్వర్లు, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు వచ్చి ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. 
ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రస్మా జిల్లా అధ్యక్షుడు రాపోలు విష్ణువర్ధన్ రావు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రైవేటు ఉపాధ్యాయులను ప్రభుత్వం గుర్తించకపోయినా ప్రతీ సంవత్సరం ట్రస్మా ఆధ్వర్యంలో వారిని ఉత్తమ ఉపాధ్యాయులుగా సన్మానిస్తున్నామని తెలిపారు. బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలకి సంపాదన ముఖ్యం కాదని ఉపాధ్యాయుల శ్రేయస్సు ప్రధానమని అని  అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజు ప్రభుత్వం  ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు ప్రైవేటు ఉపాధ్యాయులను కూడా గుర్తించాలని  వినతి పత్రం అందజేసిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసి ప్రైవేటు ఉపాధ్యాయులను కూడా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి ప్రభుత్వం ద్వారా సన్మానించాలని నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.   జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైందని అంకిత భావంతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నారు. తమకు ప్రైవేటు ఉపాధ్యాయులు, గవర్నమెంట్ ఉపాధ్యాయులు అనే భేదభావం లేదని, అయితే ఇంతకాలం సమయాభావం చేత ప్రభుత్వం తరఫున ప్రైవేటు ఉపాధ్యాయులని సన్మానించలేకపోయామని ఇకనుండి ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ఉపాధ్యాయులతో పాటు ప్రైవేటు ఉపాధ్యాయులను కూడా సత్కరిస్తామని ఇది తమ బాధ్యత అని తెలిపారు. ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి చేపట్టడం అంతా ఆశామాషీ కాదని తెలిపారు. విద్యారంగా అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషిస్తున్న గురువుల కృషిని కొనియాడారు.  కోవిడ్ 19 తర్వాత విద్యార్థులు విద్యాలోపంతోనే కాకుండా క్రమశిక్షణ రాహిత్యంతో బాధపడుతున్నారని వారిని చక్కదిద్దడం ఉపాధ్యాయులకు ఒక సవాల్ గా మారిందని తెలిపారు. ఆ సవాళ్లను వారు ఎంతో ధైర్యంతో స్వీకరించి విద్యార్థులు భవిష్యత్తుని చక్కదిద్దుతున్నారని కొనియాడారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు ర్యాంకులు, పాయింట్స్ పరమావదని, కానీ మా బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ కి విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం సర్వతో ముఖాభివృద్ధి ప్రధానమని తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా ప్రధాన కార్యదర్శి ఏనుగు శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కోశాధికారి సురభి శరత్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కస్తూరి పద్మ చరణ్, రాష్ట్ర కోఆర్డినేటర్ సిరిపురం సత్యనారాయణ, జిల్లా సైన్స్ అధికారి ఎస్.మధు, జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ గోపతి సత్తయ్య, జిల్లా సంయుక్త కార్యదర్శి దారి చంద్రమోహన్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.మధుసూదన్, వి.చక్రపాణి, కొమ్ము దుర్గాప్రసాద్, మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు ఉస్మాన్ పాషా, నస్పూర్ మండల అధ్యక్షురాలు సబిహాసుల్తానా, బెల్లంపల్లి మండల అధ్యక్షుడు రాజలింగు, తాండూర్ మండల అధ్యక్షుడు డి.రామ్మోహన్ రావు, హాజీపూర్ మండల అధ్యక్షుడు కే రవీందర్, దండేపల్లి మండల అధ్యక్షుడు బొలిశెట్టి లక్ష్మీనారాయణ, కాజీపేట మండల అధ్యక్షుడు ఎల్ రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు మరియు అన్ని మండలాల కార్యవర్గ సభ్యులు మరియు వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.