ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు హాజరు యాప్ ద్వారా చెల్లించాలి

Published: Tuesday March 07, 2023
* వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి
వికారాబాద్ బ్యూరో 06 మార్చి ప్రజాపాలన :  ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈ మాసం జీతభత్యాలు అటెండెన్స్ యాప్ ఆధారంగా అందించాలని డి డి ఓ లకు కలెక్టర్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యాశాఖ మినహా అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా అటెండెన్స్ యాప్ ఆధారంగా ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించాలని సూచించారు.  కార్యాలయానికి ఆలస్యంగా వచ్చేవారు, సమయాని కంటే ముందుగానే వెళ్ళిపోయే వారిపై దృష్టి సారించి తగు చర్యలు  పట్టాలన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది, ఇతర కొంత మంది కార్యాలయ సిబ్బంది సాంకేతిక సమస్యల వల్ల ఏమైనా సమస్యలు ఉంటే వాటిపై కూడా దృష్టి సారించి వాస్తవంగా ఉన్న సమస్యలను పరిశీలించాలన్నారు. కార్యాలయాలలో సిబ్బంది అందరూ పారదర్శకంగా పని చేయాలనే ఉద్దేశంతో అటెండెన్స్ యాప్ ను ప్రవేశపెట్టడం జరిగిందని ఎవరిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదని కలెక్టర్ అన్నారు.  జిల్లాకు చెడ్డ పేరు రాకుండా అధికారులందరూ కలిసి టీం వర్క్ గా పని చేయాలని కోరారు. కార్యాలయాలలో అటెండర్లుకు గతంలో లాగా పెద్ద పనులు లేవని, వారి సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకొని కార్యాలయ పరిశుభ్రతతో పాటు సెలవు దినాలలో టర్న్ డ్యూటీలు వేయాలని అన్నారు. కలెక్టర్ కార్యాలయంతో పాటు అన్ని కార్యాలయాలలో పరిశుభ్రత పనులు చేపట్టి కార్యాలయాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు. పాఠశాలలు వసతి గృహాలలో పరిసరాలు మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. గ్రామ పంచాయతీలలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు ఫెన్సింగ్ లేకుండా ప్రమాదకరంగా ఉన్నాయని, అట్టి వాటిని గుర్తించి ప్రమాదాలు జరగకుండా ఫెన్సింగ్ చేయాలని సూచించారు. అవెన్యూ ప్లాంటేషన్ కింద నాటిన మొక్కలు తగలబెట్టడం జరుగుతుందని, ఇలాంటి సమస్యలు తిరిగి తలెత్తకుండా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు.  విద్యార్థులకు పరీక్షలు దగ్గర పడుతున్నందున ప్రత్యేక తరగతుల నిర్వహణపై దృష్టి సారించాలన్నారు. ఈనెల 13న ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలు ఉన్నందున సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలన్నారు.  మార్చ్ 15 వరకు అన్ని గ్రామాలలో మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.  ప్రభుత్వ అధికారులందరూ నిబద్ధతలతో పనిచేసి ప్రభుత్వానికి,  జిల్లాకు మంచి పేరు వచ్చేలా పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, జిల్లా రెవెన్యూ అధికారి అశోక్ కుమార్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.