సమన్వయంతో గ్రామ సమగ్రాభివృద్ధికి కృషి చేయాలి

Published: Saturday October 08, 2022
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 7 అక్టోబర్ ప్రజా పాలన : గ్రామస్తులు అందరూ సమన్వయంతో గ్రామాభివృద్ధికి కృషి చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సూచించారు. శుక్రవారం వికారాబాద్ మండల పరిధిలోని జైదుపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ బుడిగె ఎల్లమ్మ లక్ష్మణ్, ఉప సర్పంచ్ సురేష్ ముదిరాజ్ లతో కలిసి వీధి వీధి తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు జైదుపల్లి గ్రామాన్ని మైలారం దేవరంపల్లి రైతు వేదిక క్లస్టర్ నుండి గొట్టిముక్కల రైతు వేదిక క్లస్టర్ కు మార్చాలని కోరారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి మైలారం దేవరంపల్లి క్లస్టర్ నుండి గొట్టిముక్కల క్లస్టర్ కు మార్చాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. మిషన్ భగీరథ మంచినీటి పైపు లైన్లు ఎక్కడ లీకేజీలు లేకుండా చూడాలని అన్నారు. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇవ్వాలన్నారు. గేట్ వాల్వ్ ఏర్పాటు చేసి ప్రజలకు పరిశుభ్రమైన మంచినీటిని అందించాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. పల్లె ప్రగతిలో కూల్చివేయని పాడు బడ్డ ఇండ్లను వెంటనే తొలగించాలని సర్పంచుకు కార్యదర్శికి సూచించారు. నెలలో మూడు సార్లు 1, 11, 21వ తేదీలలో మిషన్ భగీరథ త్రాగు నీటి ట్యాంకులను కచ్చితంగా శుభ్రం చేయాలన్నారు.  మిషన్ భగీరథ మంచి నీటిని  ప్రజలందరూ..  త్రాగాలని అందుకు మిషన్ భగీరథ అధికారులు అవగాహన కల్పించాలన్నారు.
 జైదుపల్లి గ్రామ సమీపంలోని మైసమ్మ కుంటలో నుండి విద్యుత్ లైన్ ను సైడ్ కు మార్చాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు. గ్రామంలో థర్డ్ వైర్ ఏర్పాటు చేసి, తదితర విద్యుత్ సమస్యలు పరిష్కారం చేయాలని, విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామంలో  నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు.