తెలంగాణ రైతాంగానికి కేంద్రప్రభుత్వం చేసిందేమిటి? స్వార్థ రాజకీయాలతో ధాన్యం కొనుగోళ్లలో సమ

Published: Wednesday May 25, 2022
కరీంనగర్ మే 24 ప్రజాపాలన ప్రతినిధి :
తెలంగాణ రైతాంగానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నష్టమే తప్ప మేలు చేసిందేమీ లేదని ఆల్ ఇండియా  ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణలోని టీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు తమ స్వార్థ రాజకీయాలతో ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు తెచ్చి రైతులను నానా అవస్థలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. రా రైస్ మాత్రమే తీసుకుంటామని కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ డ్రామాలు ఆడి చి‘వరి’కి సాధించిందేమిటని ప్రశ్నించారు.. చివరికి మేమే కొంటామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా ముందస్తు ప్రణాళిక లేకుండా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో పూర్తిగా విఫలమయ్యిందన్నారు. దానికంతటికీ ప్రధాన కారణం కేంద్రంలోని బీజేపీ యేనని మండిపడ్డారు... కొనుగోళ్ల ప్రక్రియ మొదలు పెట్టగానే రైస్ మిల్లుల్లో కేంద్ర ప్రభుత్వం గత సీజన్లలోని వడ్లు, బియ్యంపై ఎఫ్ సీ ఐ తనిఖీలు చేపట్టిందని, రాష్ట్రమంతటా రెండు వేలకు పైగా ఉన్న మిల్లుల్లో చేసిన తనిఖీలతో ఒరిగిందేమిటని ప్రశ్నించారు.. అందుకు తెలంగాణ రాష్ట్రంలోని కేంద్ర మంత్రి,  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పదే పదే తెలంగాణ ప్రభుత్వంపై నిందారోపణల కంటే రైతాంగానికి చేసిందేమిటని ప్రశ్నించారు. రైస్ మిల్లుల్లో అవినీతి జరిగి ఉంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని, సీబీ ఐ దాడులు చేయడానికైనా సిద్దమైతే ఎందుకు వెనుకడుగు వేశారని ప్రశ్నించారు?.. కేంద్ర స్వార్థపూరిత రాజకీయాల ఫలితంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఆలస్యమయ్యిందని, ఒకే సారి ధాన్యం రావడంతో కాంటాలు కావడం, గన్నీలు, టార్పాలిన్లు, లారీలు, వాహనాల నుంచి తరలింపు సమస్యతో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. మరో వైపు రారైస్ లో నూకల శాతంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో మిల్లర్లు సైతం వెనుకడుగు వేశారన్నారు. ఒత్తిడితో మిల్లుల్లో దించుకుంటున్నా తరుగు పేరుతో రైతుల నుంచి దోచుకుంటున్నారని తెలిపారు.. ధాన్యం కొంటున్నా...రైస్ మిల్లుల్లో జాగాలేదన్నారు.  గోడౌన్‌లలో సందు లేదని,  గత వానాకాలం ధాన్యానికి తోడు ఈ యాసంగి ధాన్యం కూడా వచ్చి చేరుతుండడంతో జాప్యం జరుగుతోందన్నారు.   యాసంగి ధాన్యం కొనుగోలు చేసి వాహనాల ద్వారా తరలించినా.. మిల్లులో జాగాలేకపోవడం వల్ల ధాన్యం బస్తాలు దించుకోవడం లో యజమానులు చేతులెత్తేస్తున్నారని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 550 మిల్లులకు పైగా ఉండగా కరీంనర్ జిల్లాలోనే 180 రారైస్, బాయిల్డు రైస్ మిల్లులున్నాయన్నారు. గత రబీ సీజన్ లో 10 శాతం, ఖరీఫ్ సీజన్ లో 40 శాతం ధాన్యం రైస్ మిల్లుల్లోనే ఉన్నాయని, ఈ రెండు సీజన్లు కలిపి ఇప్పటి వరకు 1 లక్ష టన్నుల వరకు రైస్ మిల్లుల్లోనే ఉండగా ఎఫ్ సీ ఐ తీసుకోలేదని తెలిపారు. రెండు పంటల కాలం పూర్తయిపోయాక కూడా రైతుల నుంచి సేకరించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ నిల్వలు పేరుకుపోవడం ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యమేనన్నారు. ట్రాన్స్ పోర్టు లారీలు, రైల్వే ర్యాకులు, స్టోరేజీ కొరత వేధిస్తోందని, అంతిమంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. స్వార్థ రాజకీయాలతో రైతులతో చెలగాటమాడడం తగదన్నారు.  కుల మత రాజకీయాలతో రైతు ప్రభుత్వమని చెప్పుకోకూడదని తెలిపారు.  దేశానికి అన్నం పెట్టే రైతులపై వివక్ష చూపడం తగదని, ఫలితంగానే రైతు ఉద్యమాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో రైతులే తగిన గుణపాఠం చెబుతారని ప్రశ్నించారు.