మున్సిపల్ సాధారణ సమావేశం వాయిదా పడడానికి కారణం ఏంటి

Published: Wednesday March 31, 2021
వికారాబాద్, మార్చి 30, ప్రజాపాలన ప్రతినిధి : మంగళవారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరగాల్సి ఉండగా అది వాయిదా పడింది. ఉదయం ఎమ్మెల్యే ఇంట్లో కౌన్సిల్ సభ్యులు సమావేశం అయ్యారు. ఆ సమావేశానికి మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల హాజరు కాలేదు.  చైర్పర్సన్ నిర్వహించిన సాధారణ సమావేశానికి కౌన్సిలర్లు రాకపోవడం ప్రస్తుతం వికారాబాద్ లో సంచలనంగా మారింది. దీంతో ఎమ్మెల్యే చైర్పర్సన్ మధ్య కోల్డ్ వార్ జరుగుతుందని బహిరంగంగానే చర్చ జరుగుతుంది. మున్సిపల్ కు వచ్చిన నిధుల విషయంలో అగ్గి రాజుకుందని కొందరు అంటుంటే లేఅవుట్ విషయంలో నిప్పు రాజుకున్నదని మరికొందరు పేర్కొంటున్నారు. సమావేశం హాలులో చైర్ పర్సన్ ఒక్కరే గంట పాటు కూర్చున్నా స్వపక్షాలతో పాటు విపక్ష సభ్యులు కూడా హాజరు కాకపోవడం పలు వివాదాలకు హేతువని గుసగుసలు వినిపిస్తున్నాయి. చైర్పర్సన్ చివరకు సమావేశాన్ని వాయిదా వేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోవడం కనిపించింది. ఈ విషయం ప్రస్తుతం రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి వరకు చేరినట్లు విశ్వసనీయ సమాచారం. అధికార పార్టీ కౌన్సిలర్లతో పాటు ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్లు కూడా సమావేశానికి హాజరు కాకపోవడంలో ఆంతర్యమేమిటో ఎవరికీ అంతుపట్టడం లేదు. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడాలి కానీ ఇలా సమావేశాలను రద్దు చేసే వరకు వెళతారా ఇదేం రాజకీయం ప్రజల అవసరాలు ముఖ్యమా లేక వారి పదవులు ముఖ్యమా  అని పలువురు వీరి తీరు పై విమర్శలు గుప్పిస్తున్నారు.