కంది పప్పుకు అంతర్జాతీయ గుర్తింపురావడం అభినందనీయం

Published: Wednesday February 01, 2023
అట్టబుల్లెట్ ఈ ప్రాంతంలో ఉండడంతో కందికి అంత ప్రత్యేకత
* వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 31 జనవరి ప్రజా పాలన : తాండూరు కందిపప్పుకు అంతర్జాతీయ గుర్తింపు జిఐ రావడం తెలంగాణ ప్రతిష్ఠ మరింత పెంచిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా యాలాల మండల పరిధిలోని దౌలాపూర్ గ్రామ సమీపంలో  ఎన్నార్జియస్ నిధుల కింద రూ. 2 కోట్ల 50 లక్షలతో నిర్మిస్తున్న గోదాం రైస్ మిల్ శంకుస్థాపనను ఎంపీ రంజిత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తో కలిసి నిర్వహించారు. అనంతరం వ్యవసాయ పరిశోధన సంస్థలు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో తాండూరు కందిపప్పుకు జి ఐ గుర్తింపు సర్టిఫికెట్లు ప్రజా ప్రతినిధులు, సైంటిస్టుల సమక్షంలో రైతులకు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 10 అంశాలలో జియో ట్యాగింగ్ వచ్చినప్పటికీ ఆనాటి పాలకులు ఆ విషయాన్ని మరుగున పరిచారన్నారు. తెలంగాణ గొప్పతనాన్ని, తాండూరు కందిపప్పు ప్రతిష్టతను నేడు కేంద్రం గుర్తించిందన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. త్వరలో ఆ నీరు ఈ ప్రదేశం లోని నేలను ముద్దాడనుందన్నారు. హైదరాబాద్ బిర్యాని , హలీం, ముత్యాలు, నిర్మల్ బొమ్మలు, పెయింటింగ్స్, గుంటూరు మిర్చి, కొల్లాపూర్ మామిడి ఎంత ప్రసిద్ధి చెందాయో నేడు తాండూరు కందిపప్పు కూడా అంతే ప్రసిద్ధి చెందిందన్నారు. తాండూరు కందిపప్పు ప్రత్యేకమైన విశిష్టమైన భౌగోళిక గుర్తింపును ఇవ్వడం ద్వారా భారత వాణిజ్య పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయంగా వర్తక వ్యాపారం చేసుకోవడానికి వీలవుతుందన్నారు. తెలంగాణలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన 16వది తాండూరు కందిపప్పు అని అన్నారు. అనంతరం తాండూరు మండలం అంతారంలో నిర్మించిన రైతు వేదికను మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి,  జిల్లా కలెక్టర్ నిఖిల, జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్, వ్యవసాయ విశ్వవిద్యాలయం సంచాలకులు డాక్టర్ జగదీశ్వర్, కంది పరిశోధన సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ సుధాకర్, జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.